Krishnam Raju

Krishnam Raju: రెబల్ రాజు.. ఆయన స్టైలే వేరు!

Krishnam Raju: రెబల్ స్టార్’గా జనం మదిలో నిలచిన నటప్రవీణుడు కృష్ణంరాజు… జనవరి 20న కృష్ణంరాజు వర్ధంతి… ఈ సందర్భంగా చిత్రసీమలో ఆయన పలికించిన బాణీని గుర్తు చేసుకుందాం…

‘రెబల్ స్టార్’ అన్న మాట వినగానే కృష్ణంరాజు ఆరడుగుల రూపం మన మదిలో మెదలుతుంది… ఆయన పోషించిన అరుదైన పాత్రలు గుర్తుకు వస్తాయి… కృష్ణంరాజు అభినయపర్వాన్ని మననం చేసుకుంటే మరిన్ని విశేషాలు మనలను పలకరిస్తాయి…

తన దరికి చేరిన ఏ పాత్రకైనా న్యాయం చేయాలని తపించేవారు కృష్ణంరాజు… కడదాకా ఆయన అదే ఉత్సాహంతో సాగడం విశేషం… తన నటవారసుడు ప్రభాస్ తో కలసి కృష్ణంరాజు అభినయించి, అభిమానులకు ఆనందం పంచారు… ఒకప్పుడు రెబల్ స్టార్ గా కృష్ణంరాజును కీర్తించిన వారందరూ నేడు ఆయన నటవారసుడు ప్రభాస్ ను అదే టైటిల్ తో పిలుస్తూ ఆనందిస్తున్నారు…

కృష్ణంరాజు నటవారసుడు ప్రభాస్ అన్నారు ఆరంభంలో జనం… ఇప్పుడు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అంటున్నారు… తన ముందే ప్రభాస్ ‘ప్యాన్ ఇండియా’ స్టార్ గా ఎదగడం చూసి ఈ పెదనాన్న మనసు ఉప్పొంగిపోయింది… ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’కు కృష్ణంరాజు సమర్పకునిగా వ్యవహరించారు. ఇందులో కూడా కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపించారు.

ఈ నాటికీ కృష్ణంరాజు అనగానే ఆయన పోషించిన అనేక మరపురాని పాత్రలు మన ముందు కదలాడతాయి… ఆయన అభినయంతో పరవశింప చేసిన పలు చిత్రాలు గుర్తుకు వస్తాయి… ఆ అభినయ వైభవం అభిమానుల మదిలో ఇప్పటికీ పదిలంగానే ఉంది… నాటి కృష్ణంరాజు అపురూప చిత్రాలను తలచుకొని ఫ్యాన్స్ పరమానందం చెందుతూనే ఉండడం విశేషం…

కృష్ణంరాజును రెబల్ స్టార్ గా నిలిపిన చిత్రాలనూ తలచుకొని అభిమానులు ఆనందసాగరంలో మునకలేస్తూ ఉంటారు… ఏ హీరోకైనా ఏదో ఒక రికార్డు ఉంటుంది… దానిని పట్టుకొనే అభిమానగణాలు ఆనందిస్తూ ఉంటాయి… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులలో ఉత్తమనటుడు విభాగం ప్రవేశ పెట్టగానే ‘అమరదీపం’ చిత్రంలోని అభినయానికి ఆ అవార్డును సొంతం చేసుకున్నారు కృష్ణంరాజు… అలా తొలి నంది ఉత్తమనటుడుగా నిలిచారు కృష్ణంరాజు… ఆ అంశమే ఆయన అభిమానులకు అమితానందం పంచుతూనే ఉంది…

‘కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ’ చిత్రాలతో మాస్ కు మరింత చేరువయ్యారు కృష్ణంరాజు… ఆ రోజుల్లో ఆరడుగుల ఎత్తున్న ఏకైక హీరో కృష్ణంరాజు అనే చెప్పాలి… అంత ఎత్తున్న కృష్ణంరాజు సైతం అభిమానులతో చిందులేయించి అలరించారు… ఆ వైనాన్ని తలచుకున్నా కృష్ణంరాజు ఫ్యాన్స్ మనసులు నేటికీ పులకరించిపోతూనే ఉంటాయి…

‘బడిపంతులు’ చిత్రంలో యన్టీఆర్ కు శ్రీదేవి మనవరాలుగా నటిస్తే, అందులో ఆమెకు తండ్రిగా కృష్ణంరాజు నటించారు… అలాంటి శ్రీదేవితో కృష్ణంరాజు నటించిన తొలి చిత్రం ‘పులిబిడ్డ’ కూడా జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది… ఇలా వైవిధ్యమైన పాత్రలతో అలరించిన కృష్ణంరాజు అభిమానుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు…

కృష్ణంరాజు అనగానే గంభీరమైన పాత్రలే గుర్తుకు వస్తాయి… కానీ, తనకు లభించిన ప్రతీపాత్రకు న్యాయం చేయాలని తపించేవారు కృష్ణంరాజు… వైవిధ్యం కోసం కృష్ణంరాజు తపించే తీరును చూసి, కొందరు రచయితలు, దర్శకులు ప్రత్యేక పాత్రలు సృష్టించారు… సదరు పాత్రల్లో కృష్ణంరాజు తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు…

ALSO READ  RC16 Update: రామ్ చరణ్ సినిమాలో మీర్జాపూర్ స్టార్!?

కృష్ణంరాజు హీరోగానే ఎంట్రీ ఇచ్చినా, తరువాత పలు రకాల పాత్రలు పోషించవలసి వచ్చింది… విలన్ వేషాలూ వేశారు… కేరెక్టర్ రోల్స్ లోనూ కనిపించారు… చివరకు స్టార్ స్టేటస్ సాధించి ‘రెబల్ స్టార్’ గా ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు…

కృష్ణంరాజు తొలి చిత్రం ‘చిలకా గోరింకా’లోనే హీరోగా నటించారు… కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిందీ చిత్రం… ఆ నాటి మేటి హీరోయిన్ కృష్ణకుమారి ఇందులో నాయికగా నటించారు… ఇక ఎస్వీ రంగారావు, అంజలీదేవి కీలక పాత్రలు పోషించారు… కథ కూడా బాగానే ఉంది… అయినా కొన్ని చిత్రాల పరాజయానికి కారణాలు బోలెడు కనిపిస్తాయి… కృష్ణంరాజు హీరోగా రూపొందిన తొలి చిత్రమే ఆకట్టుకోలేకపోవడంతో ఆయన వైపు అంతగా చూడటానికి ఎవరూ ఇష్టపడలేదు…

చిత్రసీమలో స్టార్ గా నిలదొక్కుకోవాలనే కృష్ణంరాజు కలలు కన్నారు… వెనుదిరిగిపోతే తన కలలు కల్లలవుతాయని భావించారు… ఏదో ఒకటి సినిమారంగంలోనే తేల్చుకోవాలని భావించారు… కొన్ని సినిమాల్లో విలన్ గానూ నటించారు… మరికొన్ని చిత్రాలలో బిట్ రోల్సే వేశారు… ఇంకొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించారు…

యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో ఏ పాత్ర దొరికినా నటించేశారు కృష్ణంరాజు… ఇక శోభన్ బాబు, కృష్ణ సినిమాల్లోనూ కీలక పాత్రలే ధరించారు… అలా కొంతకాలం సాగారు రాజు… ఆ పయనంలోనే రేఖ సరసన ‘అమ్మకోసం’లో కృష్ణంరాజు నాయకునిగా కనిపించారు … ఆ తరువాతే రేఖ హిందీ చిత్రసీమలో మేటి నాయికగా అలరించారు… అంటే రేఖ తొలి హీరో మన కృష్ణంరాజే అన్న మాట…

ఎన్ని చిత్రాలలో నటించినా కృష్ణంరాజు ఇమేజ్ గొర్రె తోక బెత్తెడు లాగే ఉండేది… దాంతో ఎలాగైనా తాను హీరోగా నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నం చేశారు… సొంత చిత్రాల ద్వారా కృష్ణ స్టార్ గా మారడం చూశారు… తానూ నిర్మాతగా మారి అభిరుచికి తగ్గ సినిమాలు తీయాలని భావించారు రాజు… ఆ ప్రయత్నంలో మిత్రులు చలసాని గోపి, చేగొండి హరిబాబు ఆయనకు తోడయ్యారు… అలా తమ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై తొలిగా ‘కృష్ణవేణి’ చిత్రాన్ని నిర్మించి, నటించారు రాజు… కన్నడ ‘శరపంజర’ ఆధారంగా రూపొందిన ‘కృష్ణవేణి’ తెలుగునాట కూడా జయకేతనం ఎగురవేసింది… ఆ సినిమాతోనే హీరోగా కృష్ణంరాజుకు మంచి గుర్తింపు లభించింది…

కృష్ణంరాజుకు వాణిశ్రీ అచ్చి వచ్చిన నాయిక అనే చెప్పాలి… అంతకు ముందు వారిద్దరూ పలు చిత్రాలలో కలసి నటించారు… అయితే కృష్ణంరాజుకు జోడీగా వాణిశ్రీ నటించిన తొలి చిత్రం ‘కృష్ణవేణి’… ఆ సినిమా విజయంతో వాణిశ్రీ నాయికగానే కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ నిర్మించారు… బాపు దర్శకత్వంలో రూపొందిన ‘భక్త కన్నప్ప’ ఘనవిజయం సాధించింది…

కృష్ణంరాజు పౌరాణికాల్లోనూ రాణించగలనని నిరూపించుకున్నారు… కృష్ణంరాజు శివునిగా నటించిన చిత్రం ‘వినాయక విజయము’… అందులోనూ వాణిశ్రీనే ఆయన సరసన పార్వతిగా నటించారు… ఇలా రాజు కెరీర్ లో వాణిశ్రీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది…

వాణిశ్రీ తరువాత కృష్ణంరాజుకు బాగా అచ్చివచ్చిన నాయిక జయసుధ అనే చెప్పాలి… కృష్ణంరాజు, జయసుధ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి… ప్రేక్షకుల మదిలోనూ చెరగని ముద్ర వేశాయి…

ALSO READ  Duvvada Srinivas: తిరుమలలో దువ్వాడ దరిద్రం.. కొండపై మాధురి ఇంస్టాగ్రామ్ రీల్స్

అనేక విలక్షణమైన పాత్రల్లో సలక్షణమైన అభినయం ప్రదర్శించారు కృష్ణంరాజు… ఎక్కువగా తన సొంత చిత్రాలలోనే వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు… ఆ పాత్రలే ఈ నాటికీ అభిమానుల మదిలో చిందులు వేస్తున్నాయి…

కృష్ణంరాజు తమ పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన బాపు దర్శకత్వంలో “భక్త కన్నప్ప’ నిర్మించి, ఘనవిజయం సాధించారు… ఆ తరువాత రాజు సొంత చిత్రంగా రూపొందిన ‘మనవూరి పాండవులు’కు కూడా బాపునే దర్శకులు… ఈ చిత్రంలో చిరంజీవి ఓ కీలక పాత్ర పోషించడం విశేషం… చిరంజీవి కూడా కృష్ణంరాజు ప్రాంతానికి చెందినవారే కావడం వల్ల రాజు బాగా ప్రోత్సహించారు… వారిద్దరూ కలసి కొన్ని చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు…

కృష్ణంరాజు కెరీర్ లో ది బెస్ట్ అన దగ్గ చిత్రాలన్నీ ఆయన సొంత సినిమాలే కావడం విశేషం… తనకు నచ్చిన కథలు దొరికితే చాలు, కృష్ణంరాజు, ఆయన తమ్ముడు సూర్యనారాయణరాజు ముందుకు సాగేవారు… ఈ అన్నదమ్ముల ధైర్యానికి తగ్గట్టే విజయలక్ష్మి వారిని వరించిన సందర్భాలున్నాయి…

కృష్ణంరాజు సొంత చిత్రాలలో సంగీతసాహిత్యాలకు పెద్ద పీట వేసేవారు… ఇక దాసరి నారాయణరావు ఆయనను ఏదో ఒక విలక్షణమైన పాత్రలో చూపించాలని తపించేవారు… ఆ తపనలో వెలుగు చూసిన మరో చిత్రం ‘సీతారాములు’… అంతకు ముందు అదే దాసరి దర్శకత్వంలో ‘కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ’వంటి మాస్ మూవీస్ లో నటించిన కృష్ణంరాజు, ‘సీతారాములు’లో వాటికి భిన్నమైన పాత్రలో నటించి విజయం సాధించారు…

కృష్ణంరాజు చిత్రాలలో మేటిగా నిలచింది ఏదీ అంటే – అందరికీ ‘బొబ్బిలి బ్రహ్మన్న’ గుర్తుకు వస్తుంది… కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రం అనూహ్య విజయం సాధించింది… అందులో బ్రహ్మన్నగా, ఆయన తమ్ముడు రవిగా కృష్ణంరాజు ద్విపాత్రాభినయం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది…

కథ నచ్చాలే కానీ, ఏ మాత్రం వెనుకడుగు వేసేవారు కాదు కృష్ణంరాజు… అలా కొన్నిసార్లు చేతులు కాల్చుకున్న సందర్భాలూ ఉన్నాయి… అయినా, వాటిలోనూ పాటలతో ఆకట్టుకున్న తీరును మరచిపోలేము… తాము అనుకున్నవిధంగా చిత్రాలను నిర్మించడంలోనే కృష్ణంరాజు, ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు ఆనందం పొందేవారు…

కృష్ణంరాజు తరువాతి రోజుల్లో రాజకీయాల్లోనూ రాణించారు… జయాపజయాలు చూశారు… కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు … చివరలో ఆయన బి.జె.పిలో ఉన్నారు… కృష్ణంరాజు పుట్టినరోజు అంటే ఆ రోజుల్లో అభిమానులకు ఎంతో ఆనందం పంచే రోజు… ఈ సారి కృష్ణంరాజు బర్త్ డేని ఫ్యాన్స్ మునుపటిలాగే జరుపుకోవాలని ఆశిస్తున్నారు… కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించాలనీ అభిమానులు అభిలషిస్తున్నారు…

రెబల్ స్టార్ గా జనం మదిలో నిలచిన కృష్ణంరాజు నేడు భౌతికంగా మన మధ్య లేరు… కానీ, ఆయన నటించిన చిత్రాల ద్వారా అభిమానుల మనసుల్లో నిలచే ఉన్నారు… కరిగే కాలంలో కరగని స్వప్నంలా అభిమానులకు కృష్ణంరాజు నటన సంతృప్తి కలిగిస్తూనే ఉంటుందని చెప్పవచ్చు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *