Rain alert: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్, నికోబార్ దీవులు, పుదుచ్చేరిలలో కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. బలపడిన వాయుగుండం తమిళనాడు మీదుగా శ్రీలంక వైపు కదులుతున్నది. దీంతో వాతావరణ శాఖ తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.
దీని ప్రభావంతో రెండు రోజుల్లో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని సమాచారం అందించింది. అలాగే దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో 50 నుండి 70 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వాయుగుండం ఎఫెక్ట్ తెలంగాణ వైపు కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను కారణంగా, నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక, తమిళనాడు తీరాల దగ్గర నవంబర్ 26 నుండి నవంబర్ 29 వరకు గాలుల వేగం గంటకు 65 కి.మీ.కు చేరుకునే అవకాశం ఉంది.