Punjab: పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో అత్యంత భయానక ఘటన చోటుచేసుకుంది. మెడికల్ షాపులో అక్రమంగా డ్రగ్స్, మత్తు మందులు అమ్ముతున్నారని నిలదీసిన ప్రముఖ యాంటీ-డ్రగ్ ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ ఝోటాను సదరు షాపు యజమాని పట్టపగలే తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణం మొత్తం బాధితుడు పెట్టిన ఫేస్‌బుక్ లైవ్‌లోనే రికార్డు కావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పంజాబ్‌లో మాదకద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతూ, మెడికల్ షాపుల్లో అక్రమ అమ్మకాలను గుట్టురట్టు చేసే వ్యక్తిగా పర్వీందర్ సింగ్ ఝోటాకు స్థానికంగా మంచి గుర్తింపు ఉంది.
ఫేస్‌బుక్ లైవ్‌లో ఏం జరిగింది?
పోలీసుల సమాచారం, సోషల్ మీడియా వీడియో ఆధారంగా వెలుగులోకి వచ్చిన వివరాలు. మాన్సాలోని ఓ మెడికల్ షాపులో ఒక వృద్ధుడికి మత్తు మాత్రలు అమ్మారన్న సమాచారంతో ఝోటా అక్కడికి వెళ్లారు. ఆ వృద్ధుడితో కలిసి షాపు ముందు నిలబడి తన ఫేస్‌బుక్ ఖాతాలో లైవ్ పెట్టారు. ఈ షాపులోనే డ్రగ్స్ కొన్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతూ యజమానిని నిలదీశారు.
తుపాకీతో బెదిరింపులు – మాటామాటా పెరుగుదల..
దాదాపు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన మెడికల్ షాపు యజమాని చేతిలో పిస్టల్ పట్టుకుని బయటకు వచ్చాడు. అసలు నీ దగ్గర తుపాకీ ఎందుకు ఉందని ఝోటా ప్రశ్నిస్తూ.. పోలీసులకు ఫోన్ చేయాలని, స్థానికులను పిలవాలని తన సహచరులకు చెప్పారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీ చూపించాలని డిమాండ్ చేశారు.
నన్ను చంపేయ్.. చంపేయ్..
వాగ్వాదం ముదురుతుండగా.. “ధైర్యం ఉంటే నన్ను చంపేయ్ (మార్ ముఝే.. మార్ ముఝే)” అంటూ ఝోటా పదేపదే అన్నారు. అంతలోనే షాపు యజమాని కనికరం లేకుండా పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి తుపాకీతో కాల్పులు జరపడంతో ఝోటా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు.
పర్వీందర్ సింగ్ ఝోటా నేపథ్యం..
గత కొన్నేళ్లుగా మాన్సా, పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్మకాలపై ఝోటా నిరంతరం గళమెత్తుతున్నారు.2023 జూలైలో ఓ మెడికల్ షాపు యజమానితో జరిగిన వివాదంలో ఆయన తొలిసారి వార్తల్లో నిలిచారు. ఆ సమయంలో దాడి, అతిక్రమణ వంటి అభియోగాలపై పోలీసులు ఝోటాను అరెస్టు చేయగా.. రెండు నెలల తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అయినప్పటికీ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తన నిరసనను కొనసాగిస్తూ వచ్చారు.
శాంతిభద్రతలు క్షీణించాయంటూ రాజకీయ దుమారం..
ఈ దారుణ హత్యపై పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రగ్స్ స్మగ్లర్ల చేతిలో ఉద్యమకారుడు దారుణ హత్యకు గురికావడం పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయనడానికి నిదర్శనమని మండిపడ్డారు.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తికి ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించలేదని, భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ (AAP) సర్కార్ రాష్ట్ర వనరులను లూటీ చేయడంలోనే బిజీగా ఉందని ఆరోపించారు.ప్రస్తుతం మాన్సా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న మెడికల్ షాపు యజమానిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
