Relationship Tips 

Relationship Tips: క్రష్‌కి ప్రపోజ్ చేయలేకపోతున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి..!

Relationship Tips: ఎవరినైనా ఇష్టపడినప్పుడు వారి నుంచి వచ్చే చిన్న మెసేజ్ కూడా ముఖంపై పెద్ద చిరునవ్వు తెప్పిస్తుంది. వారితో మాట్లాడేందుకు ఏదో ఒక సాకు వెతుకుతుంటాం. పదేపదే వారి గురించే ఆలోచనలు, భవిష్యత్తు గురించి ఊహలు మొదలవుతాయి. అయితే మనసులోని ఈ ప్రేమను అవతలి వారికి చెప్పే దగ్గరే అసలు కన్‌ఫ్యూజన్, భయం మొదలవుతాయి.

నేను చెబితే వాళ్లు ఏమనుకుంటారో?, నో చెబితే ఉన్న స్నేహం కూడా పోతుందా? నా క్యారెక్టర్‌ను తప్పుగా అర్థం చేసుకుంటారా? అనే భయాలతో ఎంతోమంది తమ మనసులోని మాటను లోపలే దాచేసుకుంటారు. కానీ సరైన పద్ధతిలో, గౌరవప్రదంగా మనసు విప్పితే ఎలాంటి ఇబ్బంది లేకుండా భావాలను పంచుకోవచ్చు. డేటింగ్ మరియు రిలేషన్‌షిప్ నిపుణులు సూచిస్తున్న కొన్ని ప్రాక్టికల్ మార్గాలు ఇక్కడ చూద్దాం.

1. ముందుగా చిన్న చిన్న హింట్స్ ఇవ్వండి..

ఉన్నట్టుండి ఒక్కసారిగా వెళ్లి ప్రపోజ్ చేస్తే అవతలి వ్యక్తి షాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

చిరు సంభాషణలతో సాన్నిహిత్యం..

మొదట చిన్న చిన్న విషయాలతో మాటలు కలపండి. వారికి ఇష్టమైన పాటలు, సినిమాలు, రోజువారీ విశేషాల గురించి మాట్లాడండి. వారు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి.

కంటి చూపు & చిన్న టీజింగ్..

మాట్లాడేటప్పుడు ఐ-కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, చిన్నపాటి సరదా ఆటపట్టించడం లేదా సోషల్ మీడియాలో సాధారణ మెసేజ్‌లతో టచ్‌లో ఉండటం ద్వారా మీరు వారిని గమనిస్తున్నారనే హింట్ ఇవ్వొచ్చు. దీనివల్ల అవతలి వ్యక్తి మీ గురించి ఆలోచించడం మొదలుపెడతారు. అయితే వారు కేవలం స్నేహంగా ఉన్నంత మాత్రాన ప్రేమిస్తున్నారని ముందే ఊహించుకోకూడదు.

2. సరైన సమయం, ఏకాంత ప్రదేశం ఎంచుకోండి..

ప్రేమను వ్యక్తపరచడానికి ఖరీదైన గిఫ్టులు లేదా సినిమా తరహా గ్రాండ్ సెటప్‌లు అవసరం లేదు..

ప్రైవేట్ లేదా సెమీ-ప్రైవేట్ స్పేస్.. 

రద్దీగా ఉండే కేఫ్‌లు లేదా కాలేజీ కారిడార్లలో కాకుండా.. ఇద్దరూ ప్రశాంతంగా, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని మాట్లాడుకునే పార్క్, బీచ్ వాక్ లేదా ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి.

ముందే చిన్నగా ప్రిపేర్ చేయండి..

వారు ఆఫీస్ వర్క్ లేదా కాలేజీ ఒత్తిడిలో ఉన్నప్పుడు కాకుండా రిలాక్స్‌డ్ టైమ్‌లో మాట్లాడండి. నీతో ఒక ముఖ్యమైన విషయం నిజాయతీగా మాట్లాడాలి, కాసేపు టైమ్ దొరుకుతుందా? అని ముందే చెప్పడం వల్ల వారు మానసికంగా సిద్ధమవుతారు.

3. ఏం మాట్లాడాలో ముందే ఒక క్లారిటీ తెచ్చుకోండి (ప్రాక్టీస్ చేయండి)..

టెన్షన్‌లో ఏం మాట్లాడుతున్నామో అర్థం కాకపోవడం సహజం. అందుకే ఒక రోజు ముందే మనసులోని మాటలను పేపర్‌పై రాసుకోవడం లేదా మనసులో రిహార్సల్ చేసుకోవడం మంచిది.

చాలా రోజులుగా వాయిదా వేస్తుంటే.. మీకంటూ ఒక డెడ్‌లైన్ (తేదీ) పెట్టుకోండి. ఆలస్యం చేసే కొద్దీ ఓవర్ థింకింగ్ ఎక్కువై ధైర్యం తగ్గిపోతుంది.

ఒకవేళ నేరుగా ఎదురెదురుగా చెప్పడానికి విపరీతమైన భయం అనిపిస్తే.. ఒక నీట్ మెసేజ్ లేదా టెక్స్ట్ ద్వారా చెప్పడం కూడా ఒక మార్గమే. అయితే ముఖాముఖి మాట్లాడితే భావాలు మరింత స్పష్టంగా చేరతాయి.

4. మీరు వారిలో ఏం ఇష్టపడుతున్నారో స్పష్టంగా చెప్పండి..

జనరల్ గా “ఐ లైక్ యు” అనడం కంటే.. వారిలోని ఏ లక్షణాలు మీకు నచ్చాయో చెప్పడం బాగుంటుంది.

నువ్వు అందరితో ఎంతో మర్యాదగా ఉంటావు, నీ ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చుతుంది.. నీతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు, చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది లాంటి నిజమైన ప్రశంసలు అవతలి వారికి మీపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాయి.

5. సమాధానం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడి చేయకండి..

మీ మనసులోని మాట చెప్పిన వెంటనే ఎదుటివారి నుంచి ఆన్సర్ రావాలని ఆశించకండి.

మీరు కొన్ని నెలలుగా ఆలోచించి ఈ విషయం చెప్పి ఉండవచ్చు, కానీ అవతలి వారికి ఇది పూర్తిగా కొత్త ఆలోచన కావచ్చు. కాబట్టి వారు ఆలోచించుకోవడానికి సమయం, స్పేస్ ఇవ్వండి.

స్పష్టత ఇవ్వండి..

నేను నా ఫీలింగ్స్ చెప్పాను అంతే, నువ్వు వెంటనే సమాధానం చెప్పాల్సిన పనిలేదు.. తీరిగ్గా ఆలోచించుకో” అని చెప్పడం వల్ల వారు ఇబ్బంది పడకుండా ఉంటారు. పదేపదే ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పెట్టి సమాధానం డిమాండ్ చేయడం అస్సలు చేయకూడదు.

6. మీలా మీరు ఉండండి – ఇతరుల కోసం నటించకండి..

క్రష్‌ను ఇంప్రెస్ చేయడానికి మీ అసలు వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు.

మీరు కాకుండా వేరొకరిలా నటిస్తే ఎక్కువ కాలం కొనసాగించలేరు. సహజంగా, ఆత్మవిశ్వాసంతో ఉండండి.

కొంచెం నెర్వస్‌గా ఉన్నా మొహంపై చిరునవ్వు ఉండేలా చూసుకోండి. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది.

7. ఎదుటివారి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా గౌరవించండి..

ఒకవేళ అవతలి వ్యక్తి మీ ప్రేమను అంగీకరించకపోతే దాన్ని గౌరవంగా స్వీకరించండి..

నువ్వు నన్ను అలాగే చూడలేకపోయినా పర్లేదు, మన స్నేహం నాకు ఎప్పటికీ విలువైందే అని చెప్పడం ద్వారా మీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుస్తుంది.

రిజెక్షన్ వస్తే ప్రపంచం అంతమైపోదు.. 

ఒకరు మీ ప్రేమను అంగీకరించనంత మాత్రాన మీ వ్యక్తిగత విలువ తగ్గిపోదు. ఈ ఆలోచనతోనే జీవితాంతం మథనపడటం కంటే.. కనీసం నా ఫీలింగ్స్ చెప్పానన్న తృప్తి ఉంటుంది. అవతలి వారి సమాధానం ఏదైనా, నిజాయతీగా వ్యక్తం చేయడం, వారి నిర్ణయాన్ని గౌరవించడమే నిజమైన పరిపక్వత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *