Kokapet

Kokapet: కోకాపేట నియోపోలిస్ భూముల వేలానికి ఊహించని షాక్..!

Kokapet: ఒకప్పుడు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ ఎకరా రూ.100 కోట్లు దాటి సరికొత్త రికార్డులు సృష్టించిన హైదరాబాద్‌లోని కోకాపేట నియోపోలిస్ (Kokapet Neopolis) లేఅవుట్ భూముల వేలానికి ఈసారి ఊహించని షాక్ తగిలింది! నియోపోలిస్ లేఅవుట్‌లోని ప్లాట్ నంబర్ 17లో ఉన్న మొత్తం 4.59 ఎకరాల భూమిని విక్రయించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) శుక్రవారం (నవంబర్ 27, 2026) నిర్వహించిన ఈ-వేలానికి స్థిరాస్తి సంస్థల నుంచి స్పందన కరవైంది. ఎకరా కనీస ధర (అప్‌సెట్ ధర)ను రూ.120 కోట్లుగా నిర్ధారించగా, ఒక్క బిడ్డు కూడా దాఖలు కాకపోవడంతో అధికారులు వేలాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

నిజానికి ఈ ప్లాట్ నంబర్ 17 భూమి కథ మళ్లీ మొదటికి రావడం ఇది రెండోసారి. గత సెప్టెంబర్ నెలలోనూ ఇదే 4.59 ఎకరాల భూమికి హెచ్ఎండీఏ వేలం నిర్వహించగా, అప్పుడు ఎకరాకు రూ.120 కోట్ల ధరతో కేవలం ఒకే ఒక్క బిడ్డు దాఖలైంది.

నిబంధనల ప్రకారం వేలంలో పోటీ లేకపోవడంతో సింగిల్ బిడ్ కారణంగా అప్పట్లోనూ అధికారులు వేలాన్ని రద్దు చేశారు. తాజాగా శుక్రవారం నిర్వహించిన వేలంలో ఆ ఒక్క బిడ్డు కూడా దాఖలు కాకపోవడంతో నియోపోలిస్ భూముల విక్రయ ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడింది.

బహుళ అవసరాల జోన్ (Multi-use Zone) కింద ఉన్న ఈ నియోపోలిస్ లేఅవుట్‌లో ఇప్పటికే 60 అంతస్తుల భారీ వాణిజ్య, నివాస, వ్యాపార భవనాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. తొలి దశ వేలంలో ఇక్కడ ఎకరం వంద కోట్ల మార్కును దాటడంతో, మిగిలిన భూములకు కూడా అంతకుమించి ధర పలుకుతుందని అధికారులు అంచనా వేశారు.

అయితే, ఎకరా కనీస ధరనే ఏకంగా రూ.120 కోట్లుగా నిర్ణయించడం, దానికి తోడు వేలంలో పాల్గొనేందుకు ముందస్తు దరావత్తు (EMD) కింద రూ.5 కోట్లు చెల్లించాలనే నిబంధన పెట్టడం వల్లే రియల్ ఎస్టేట్ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసగా రెండోసారి కూడా ఈ భూమికి బిడ్లు రాకపోవడంతో, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు, అప్‌సెట్ ధర సవరణ వంటి అంశాలపై హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *