Puducherry: పుదుచ్చేరి మాజీ. సీఎం ఎండీఆర్ రామచంద్రన్ సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పుదుచ్చేరి సీఎం రంగస్వామి మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పుదుచ్చేరి స్వగ్రామం మదుకరైలో జరగనున్నాయి.
ఎండీఆర్ జనవరి 31, 1934న జన్మించారు. 1969లో డీఎంకే అభ్యర్థిగా నొట్టపాక్కం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం పన్నాడికుప్పం నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1980 నుంచి 1983 వరకు మొదటి సారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా, 1990 నుంచి 1991 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా పని చేశారు. 2001లో ADMKలో చేరి స్పీకర్‌గా సేవలు అందించారు. ఆయన మరణం పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చివరికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు.