Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మీయ పండుగలలో ప్రముఖమైన బోనాల పండుగను ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. జూన్ 26న చారిత్రాత్మక గోల్కొండ కోటలో తొలి బోనం వేడుకలు ప్రారంభమవనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అనంతరం బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయినీ మహంకాళి, లాల్‌దర్వాజ బోనాలు అనుసరిస్తాయని తెలిపారు.
ఈ పండుగను రాష్ట్ర గౌరవానికి ప్రతిరూపంగా నిలిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 కోట్ల నిధులను కేటాయించినట్లు చెప్పారు. దేవాలయాల అభివృద్ధి కోసం ఇవ్వబోయే చెక్కులను రెవెన్యూ, ఎండోమెంట్స్ శాఖలు సమన్వయంతో వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
బోనాల సందర్భంలో నిర్వహించే రంగం, తొట్టెల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా బోనాల ఉత్సవాలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
పండుగను ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, శానిటేషన్, లైటింగ్, వాటర్ సప్లై, రెవెన్యూ, కంట్రోల్ రూమ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టంగా తెలిపారు. పోలీసు శాఖ కూడా లా అండ్ ఆర్డర్ పరంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారులు తమ బాధ్యతను కేవలం ఉద్యోగంగా కాకుండా భక్తి భావంతో నిర్వహించాలని కోరారు. ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాల బోనాల ఉత్సవాల కోసం ప్రత్యేక ‘యాక్షన్ ప్లాన్’ రూపొందించాలని అన్నారు.
బోనాల పండుగ విజయవంతమైతే, ఇది హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. అందరూ భాగస్వాములై సంప్రదాయ నృత్యాలు, ఊరేగింపులు, శోభాయాత్రలతో ఈ పండుగను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.