Jogi Ramesh: విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో జరిగిన రాజకీయ ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి మరియు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల చుట్టూ ఈ కేసులు తిరుగుతున్నాయి. రెండు పార్టీల నేతలతో పాటు కార్యకర్తలపై కూడా పోలీసులు చర్యలు చేపట్టారు.
మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, కులాలు మరియు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనే ఆరోపణలపై జోగి రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని ఆయనపై పలు కఠిన సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ అయింది.
దాడి ఘటనపై సుమోటోగా కేసు: జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడిని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా స్వయంగా (సుమోటోగా) కేసు నమోదు చేశారు. ఈ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించిన టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబూరావులపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: ప్రజల తరపున నేనే లాయర్ని.. సుప్రీంకోర్టులో మమత బెనర్జీ పోరాటం..
వైసీపీ నేతలపై కూడా చర్యలు: జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ ముఖ్య నేతలపై కూడా పోలీసులు కేసులు పెట్టారు.
- దేవినేని అవినాష్ (ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు)
- మొండితోక జగన్మోహన్ రావు (మాజీ ఎమ్మెల్యే) మరియు ఇతర నేతలపై విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసులు ఫైల్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇబ్రహీంపట్నం హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న పోలీసుల పనిని అడ్డుకున్నారని, నిబంధనలను ఉల్లంఘించారని వైసీపీ నేతలపై అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
