PM Modi

PM Modi: భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. రూ. 18,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!

PM Modi: ఉత్తరాంధ్ర ప్రగతి ముఖచిత్రాన్ని మార్చేసే సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో సుమారు రూ. 5,000 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించారు.

ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

టెర్మినల్ విశేషాలను పరిశీలించిన ప్రధాని

ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని కాలినడకన సందర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడూ ఆయన వెంట ఉండి విమానాశ్రయంలోని వివిధ విభాగాలు, సాంకేతిక ప్రత్యేకతలను వివరించారు.

  • అద్భుత డిజైన్: టెర్మినల్ పైకప్పును అరకు లోయ రూపం, సాంప్రదాయ ‘చుట్టిల్లు’ కట్టడాలు ఇంకా  ఎగిరే చేప (Flying Fish) ఆకృతి ప్రేరణతో నిర్మించిన తీరును జీఎమ్‌ఆర్ (GMR) సంస్థ ప్రతినిధులు ప్రధానికి వివరించారు.

  • ఆధునిక సాంకేతికత: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బయోమెట్రిక్ పాసింజర్ ప్రాసెసింగ్, ఎయిర్‌సైడ్ 4.0 సాంకేతికతలతో రూపుదిద్దుకున్న విధానాన్ని పరిశీలించారు.

  • భవిష్యత్తు విస్తరణ: మొదటి విడతలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్ట్‌ను.. భవిష్యత్తులో ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా విస్తరించే మాస్టర్ ప్లాన్‌ను ప్రధాని వీక్షించారు.

ఈ సందర్భంగా ఓపెన్ టాప్ జీపులో సభా ప్రాంగణానికి విచ్చేసిన ప్రధాని మోదీకి 13,500 మందికి పైగా గిరిజన బాలికలు, మహిళలు ఏకకాలంలో ‘ధింసా’ నృత్యంతో నీరాజనం పలికారు.

ఏపీకి రూ. 18,000 కోట్ల అభివృద్ధి కానుకలు!

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సుమారు రూ. 18,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు..

  1. విశాఖలో సెమీకండక్టర్ ప్లాంట్ (రూ. 460 కోట్లు): ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ కింద ఆమోదం పొందిన ఏపీ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి (ASIP Technologies) శంకుస్థాపన చేశారు. ఇది ఏటా 9.6 కోట్ల చిప్‌లను తయారు చేయనుంది.

  2. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు (రూ. 10,000 కోట్లకు పైగా): కర్నూలు విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ప్రసార వ్యవస్థలు, అనంతపురం, కర్నూలు సోలార్ పార్కుల గ్రిడ్ లైన్లను జాతికి అంకితం చేశారు.

  3. జాతీయ రహదారుల విస్తరణ (రూ. 1,880 కోట్లు): రేచర్ల నుంచి గురువాయగూడెం వరకు 4-లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేతో పాటు, జాతీయ రహదారి-565 పై లింగసముద్రం వద్ద నిర్మించే హైలెవల్ వంతెనకు శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *