PM Modi

PM Modi: ప్రజాసేవలో పాతికేళ్లు.. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప అభియాన్’.. !

PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (BJP) దేశవ్యాప్తంగా భారీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న అరుదైన మైలురాయిని పురస్కరించుకుని గురువారం నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప అభియాన్’ పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సాగిన పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 దాకా ‘సేవా సంకల్ప అభియాన్’.. 

‘ప్రజా సేవ నుండి దేశ సేవ’ అనే సంకల్పంతో మోదీ గత 25 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్నారని, ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 17ను ‘సేవా దివస్’గా పాటిస్తూ ఈ మహా ప్రచారానికి నాంది పలికారు. ఈ ప్రచారం అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు నిరంతరాయంగా సాగుతుంది. మధ్యప్రదేశ్‌లోని మహాకాళ్ దివ్య క్షేత్రమైన ఉజ్జయిని వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హేమంత్ ఖండేల్‌వాల్‌లతో కలిసి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలు..

నెల రోజుల పాటు ప్రజలతో నేరుగా మమేకమయ్యేలా విస్తృత స్థాయి కార్యక్రమాలకు పార్టీ కార్యచరణ సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, స్వచ్ఛతా (పరిశుభ్రత) డ్రైవ్‌లు, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
‘ఆశీర్వాద్ కా దియా’
ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 17 సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలపాలనే పిలుపుతో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమాన్ని చేపట్టారు.

 

డిజిటల్ ఎగ్జిబిషన్లు & ప్రత్యేక యాత్రలు..
మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం, అభివృద్ధి, సంస్కరణలను ప్రతిబింబించేలా ప్రధాన నగరాల్లో ఫొటో, డిజిటల్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్‌లోని ఆయన స్వగ్రామం వడ్నగర్ నుంచి పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసి వరకు మోదీ రాజకీయ ప్రస్థానంతో ముడిపడిన ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక యాత్రలు చేపట్టనున్నారు.

 

యువత భాగస్వామ్యం – సంక్షేమ పథకాల ప్రచారం..

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు విద్యా, సామాజిక సేవా రంగాల్లో యువతను భాగస్వామ్యం చేసేలా అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ నెల రోజుల ప్రచారానికి అక్టోబర్ 17న అధికారికంగా ముగింపు పలకనున్నారు. ఆ రోజున దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల సమీక్షతో పాటు భారీ ఎత్తున ప్రజా భాగస్వామ్య సభలు నిర్వహించనున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *