KTR

KTR: మా నాన్న భూస్వామి.. నా ఆస్తులు సంపాదించుకున్నవే

KTR: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల భూములు, కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల భూదోపిడీకి పాల్పడేందుకే ధరణిని రద్దు చేసి ‘భూభారతి’ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాలు అని ప్రచారం చేసి, నిన్నటి అసెంబ్లీలో వందల ఎకరాలు అని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి అబద్ధాలు, ఆయన నిజాయితీ ఏంటో ప్రజలకు అర్థమైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై చేసిన తప్పుడు ప్రచారానికి రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మా నాన్న భూస్వామి.. నా ఆస్తులు సంపాదించుకున్నవే

తన తండ్రి కేసీఆర్ అసలైన భూస్వామి అని, ఆయనకు వందల ఎకరాలు ఉండకూడదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తాను అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగం చేసి సంపాదించిన కష్టార్జితంతో భూములు కొనుక్కుంటే.. వాటిని అక్రమ భూములుగా చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు. ఆ వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లలో ఎప్పుడో చూపించామని గుర్తుచేశారు.
“ఒకప్పుడు రోడ్లపై, గోడలపై రాతలు రాసుకునే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ప్యాలెస్ ఎలా వచ్చింది? కేవలం డిగ్రీ మాత్రమే చదివిన నీకు ఇన్ని వేల ఎకరాల ఆస్తులు, నీ తమ్ముళ్లకు ఏరోస్పేస్ కంపెనీలు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పగలవా?” అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. నువ్వు అధికారంలోకి వచ్చాక మీ బాబాయి ఎందుకు చనిపోయాడో కూడా సమాధానం చెప్పాలని నిలదీశారు.
పొంగులేటి వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే కుట్ర:
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి సంబంధించిన భూముల వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే.. కేసీఆర్ ఫామ్‌హౌస్, బీఆర్ఎస్ నేతల భూములంటూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని నిషేధిత జాబితా (22ఏ) నుంచి ఎలా తొలగించారని, రాష్ట్రంలో సీఎంకు ఒక చట్టం, సామాన్య ప్రజలకు మరో చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. 22ఏ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
దమ్ముంటే నెల రోజులు సభ నడపండి.. చర్చకు సిద్ధం..
భూ సమస్యలు, 22ఏపై నిజంగా కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే.. అసెంబ్లీని నెల రోజుల పాటు నిర్వహించి పూర్తిస్థాయి చర్చకు అనుమతించాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ శాసనసభ్యులపై అన్యాయంగా విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేస్తే.. తామంతా సభకు హాజరై రేవంత్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణకూ ఆధారాలతో సహా దీటైన సమాధానం చెబుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *