Chandrababu

Chandrababu: కాశీ విశ్వనాథుడి సన్నిధిలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

Chandrababu: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు, అలాగే ఆయన ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (కాశీ) పుణ్యక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రధాని దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాల కోసం వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రార్థనలు చేశారు.

కాశీ విశ్వనాథుడి గర్భగుడిలో సీఎం చంద్రబాబు, రాజ్ నాథ్, యోగి పూజలు..

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులతో పాటు కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఇతర బీజేపీ సీనియర్ నేతలు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, నాయకులకు శాలువాలు, పూలమాలలు, తీర్థప్రసాదాలు అందజేశారు. జలాభిషేక పూజల అనంతరం.. మోదీ 76వ పుట్టినరోజు గుర్తుగా నేతలు 76 కిలోల లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేశారు. మోదీ కర్మభూమి వారణాసి నుంచి ఆయన జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్ నగర్ వరకు సాగే ‘సేవా సంకల్ప్’ మోటార్ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో పాల్గొనే 51 మంది ‘సేవా యాత్రికులను’ ప్రముఖులు ఘనంగా సత్కరించారు.
గుజరాత్‌లో ‘ఆశీర్వాద్ నూ దివ్డో’ – 88 లక్షల ప్రమిదల వెలుగులు..
ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఆయన జన్మదినాన్ని అపూర్వ రీతిలో జరుపుకుంటున్నారు.. గురువారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా 18,500 ప్రాంతాల్లో ఒకేసారి రికార్డు స్థాయిలో 88 లక్షల ప్రమిదలను వెలిగించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ‘ఆశీర్వాద్ నూ దివ్డో’ పేరుతో ఈ భారీ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

 

కంకరియా, అటల్ బ్రిడ్జ్ వద్ద కాంతులు
అహ్మదాబాద్‌లోని ప్రముఖ కంకరియా లేక్‌ఫ్రంట్ వద్ద ఏకంగా 1.25 లక్షల దీపాలు, సబర్మతి రివర్‌ఫ్రంట్‌లోని అటల్ బ్రిడ్జ్ వద్ద 76 వేల దీపాలను వెలిగించి నగరాన్ని కాంతులీనేలా ముస్తాబు చేశారు.
లక్నోలో 30 రోజుల మెగా స్వచ్ఛతా డ్రైవ్..
మోదీ పుట్టినరోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మేయర్ సుష్మా ఖరక్‌వాల్ 30 రోజుల నిరంతర ‘మెగా శానిటేషన్ డ్రైవ్’ను ప్రారంభించారు.

మహానగర పాలక సంస్థ సిబ్బంది అంతా సమన్వయంతో రోజుకో జోన్‌లో రంగంలోకి దిగి డ్రైనేజీలు, మురుగు కాలువలు, చెరువులు, నీటి వనరులను శుభ్రం చేయనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సాగే ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఈ పౌర సేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *