PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనా పర్యటనలో చారిత్రక ఘట్టం నమోదైంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఘనాను సందర్శించిన భారత ప్రధానిగా మోదీ, గురువారం ఘనా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ అవకాశం తనకు లభించడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విలువలను ఘనా దేశం బలంగా చాటుతోందని ప్రశంసించారు. ప్రధాని మోదీకి ఘనా జాతీయ అవార్డును ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని భారత్-ఘనా మధ్య ఉన్న బలమైన సంబంధాలకు అంకితమిస్తున్నానని, 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఘనాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మోదీ అన్నారు.
తన ప్రసంగంలో ప్రధానంగా ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. భారతదేశాన్ని “ప్రజాస్వామ్యానికి తల్లి”గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, స్వేచ్ఛాయుత చర్చలకు ఎంత ప్రాధాన్యత ఉందో వివరించారు. మానవత్వానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడమే భారతదేశం యొక్క సిద్ధాంతమని ఆయన పునరుద్ఘాటించారు. “మాకు ప్రజాస్వామ్యం కేవలం ఒక వ్యవస్థ కాదు, అది మా సంస్కారం” అని హిందీలో చెప్పి, ఆ తర్వాత ఆంగ్లంలో కూడా వివరించారు.
Also Read: komatireddy venkatreddy: అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులు చెప్పాలి
PM Modi: భారతదేశంలో 2,500 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రధాని మోదీ ప్రస్తావించినప్పుడు, ఘనా పార్లమెంట్‌లోని సభ్యులు ఆశ్చర్యంతో చిరునవ్వులు చిందించారు. ప్రధాని మోదీ తన మాటలను మళ్లీ నొక్కి చెప్పడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. నిజమైన ప్రజాస్వామ్యం చర్చను ప్రోత్సహిస్తుందని, ప్రజలను ఏకం చేస్తుందని, గౌరవాన్ని, మానవ హక్కులను ప్రోత్సహిస్తుందని మోదీ అన్నారు.
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం చేకూర్చే విస్తారమైన వైవిధ్యాన్ని ప్రధాని మోదీ వివరించారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పాలిస్తున్నాయని, 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయని పేర్కొన్నారు. “భారతదేశానికి వచ్చిన ప్రజలను ఎల్లప్పుడూ విశాల హృదయాలతో స్వాగతించడానికి ఇదే కారణం” అని ప్రధాని అన్నారు. ఈ స్ఫూర్తే భారతీయులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సులభంగా కలిసిపోవడానికి సహాయపడుతుందని మోదీ తెలిపారు. ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత, ఘనా పార్లమెంట్ స్పీకర్ అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ కూడా “2,500 రాజకీయ పార్టీల” సంఖ్యను పునరావృతం చేయడంతో సభలో మరోసారి నవ్వులు పూసాయి.