komatireddy venkatreddy: తెలంగాణ రోడ్ల అభివృద్ధిపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో రహదారి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, హ్యామ్ మోడల్ ద్వారా రహదారి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ. 6,500 కోట్ల విలువైన రూరల్ రోడ్లకు టెండర్లు పిలిచామని, అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులు త్వరగా పూర్తిచేయాలని స్పష్టంగా చెప్పారు.
రహదారులు కాంట్రాక్టర్ల కోసమో, ప్రభుత్వ కోసమో కాదని… ఇవి ప్రజల అవసరాల కోసం అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రహదారుల అభివృద్ధిలో దేశానికి రోల్ మోడల్ గా మారేలా చర్యలు తీసుకుంటున్నామని, రానున్న మూడేళ్లలో అన్ని గ్రామీణ రహదారులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అసెంబ్లీ విషయానికి వచ్చేటట్లయితే, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వస్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. కానీ హరీష్ రావు, కేటీఆర్‌లతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఉద్యమ కాలంలో కేసీఆర్‌తో కలిసి పని చేసిన సంగతిని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినది కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు.
హరీష్ రావు అసెంబ్లీలో నార్మల్ ఎమ్మెల్యే మాత్రమేనని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే తప్పులను ఎత్తిచూపే అవకాశం ఉంటుందని అన్నారు. కేసీఆర్ సూచనలు ఉంటే స్వీకరిస్తామని, తప్పులు ఉన్నట్లయితే సరిదిద్దుకుంటామని చెప్పారు. హరీష్, కేటీఆర్‌లే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, వారు కేసీఆర్ చుట్టూ ఉండి చెప్పే ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ (RRR) పై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీలను త్వరలో కలవనున్నట్లు చెప్పారు. ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం త్వరలో లభిస్తుందని, టెండర్ ప్రక్రియ వేగవంతం చేస్తామని తెలిపారు. ఓఆర్ఆర్ (ORR) నిర్మాణం రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తి అయినదిగా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మూడేళ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.