CM REVANTH REDDY: తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్‌ను దేశంలోనే ప్రపంచ స్థాయిలో ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ముందుందనీ, హైదరాబాద్‌కు దేశంలో ఏ నగరం కూడా పోటీ కాదని, తమ పోటీ ప్రపంచ నగరాలతోనేనని పేర్కొన్నారు. మన యువతలో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే నైపుణ్యం ఉందని, అదే అభివృద్ధికి బలంగా మారుతుందని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్న సీఎం, గతంలో కులీ కుతుబ్ షాహీలు హైదరాబాద్‌ను నిర్మించగా, నిజాం నవాబులు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి సైబరాబాద్‌ను మూడో నగరంగా తీర్చిదిద్దారని చెప్పారు.
ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం “భారత్ ఫ్యూచర్ సిటీ” పేరుతో నాల్గవ నగరాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోందని వెల్లడించారు. రాబోయే 100 ఏళ్లకు అనుగుణంగా, తెలంగాణ అభివృద్ధికి దోహదపడేలా “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన నగరం నిర్మించేందుకు సింగపూర్‌తో పాటు ఇతర అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ దేశంలోనే ఐటీ, ఫార్మా రంగాల్లో లెజెండ్‌గా గుర్తింపు పొందిందని, ఇప్పుడు గోల్డ్, జెమ్స్ రంగంలో కూడా హైదరాబాద్ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదుగుతున్నదని చెప్పారు. పెట్టుబడిదారులకు కేవలం ఆహ్వానం ఇవ్వడం కాదు, వారిని రక్షిస్తూ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, రాయితీలు, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పాలకులు మారినా పెట్టుబడులపై ప్రభుత్వ వైఖరి మారదని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.