Pawan Kalyan: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై పూర్తిస్థాయిలో దృష్టి నిలిపి, గ్రామీణ పాలనలో తనదైన ముద్ర వేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు అటవీశాఖ సమగ్ర మార్పులపై దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలతో పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని గాడిలో పెట్టి పరుగులు పెట్టించేలా చొరవ చూపారు. ఆయన మరో శాఖ అయిన అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కార మార్గాలను పరిశీలిస్తున్నారు.
Pawan Kalyan: ఈ మేరకు అటవీశాఖ సమగ్ర సమాచారంపై సత్వర నివేదిక ఇవ్వాల్సిందిగా తాజాగా అటవీశాఖ పీసీసీఎఫ్, హెచ్‌వోఎఫ్‌లను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. గత కొన్నేళ్లుగా అటవీశాఖ సరైన ప్రగతిని సాధించలేకపోయిందని పవన్ ఈ సందర్భంగా తెలిపారు. అటవీశాఖకు ఎదురవుతున్న సవాళ్లను, శాఖా పరంగా ఉన్న సమస్య పరిష్కారానికి ప్రాధాన్య క్రమంలో మార్పులు తెచ్చేందుకు ఆయన శ్రీకారం చుట్టారు.
Pawan Kalyan: రాష్ట్రంలోని అటవీశాఖలో సమర్థమైన అధికారులు ఉన్నప్పటికీ సరైన ఫలితాలు సాధించలేకపోయిందని, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదని పవన్ కల్యాణ్ భావించారు. ఈ శాఖలో సరైన మార్పులు తీసుకొస్తే రాష్ట్ర అవసరాల్లో, అభివృద్ధిలో ప్రాధాన్య క్రమంలో నిలిపేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. నూతనోత్తేజంతో, అద్భుత ప్రగతితో అటవీశాఖ పచ్చగా కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు.
Pawan Kalyan: అటవీశాఖ సమగ్ర మార్పుల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలుత భూముల పరిరక్షణను తొలి ప్రాధాన్యంగా తీసుకున్నారు. ముఖ్యంగా కడప అటవీ డివిజన్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ డివిజన్ పరిధిలోని విలువైన భూములు, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా ఆ భూముల రక్షణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఈ మేరకు పవన్ కల్యాణ్ ఆదేశాలను జారీచేశారు.
Pawan Kalyan: శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంపై పకడ్బందీగా కార్యాచరణను సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. రాష్ట్రం నుంచి వేర్వేరు మార్గాల్లో ఇతర రాష్ట్రాల సరిహద్దుల ద్వారా ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టాలని మలిప్రాధాన్యంగా భావిస్తున్నారు.
Pawan Kalyan: అదేవిధంగా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో దొరికే అరుదైన, విలువైన, మేలైన అటవీ ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపుదలకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పవన్ కల్యాణ భావిస్తున్నారు. గిరిజనులను ఈ ప్రణాళికలో భాగం చేయాలని, మార్కెటింగ్‌లో భాగస్వామ్యం కల్పించాలని ఆయన ఆలోచిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని అటవీ ప్రాంతం 50 శాతం లక్ష్యసాధనలో భాగంగా ప్రణాళికలతో ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృఢ సంకల్పంతో ఉన్నారు.