pawan-kalyan-fan-ponugoti-niranjan-passed-away-hyderabad-hospital

Niranjan: పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి..!

Niranjan: హనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ వీరాభిమాని, 17 ఏళ్ల పొనుగంటి నిరంజన్ ఇకలేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్, హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. వరంగల్ కేయూ సమీపంలోని హనుమాన్ నగర్‌కు చెందిన రాంగోపాల్, మానస దంపతుల కుమారుడైన నిరంజన్.. ‘డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫి’ అనే ప్రమాదకరమైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. ఇటీవల అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తల్లిదండ్రులు చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కానీ, డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

నిరంజన్ మంచంపైనే ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిగా మారాడు. ఎలాగైనా తన అభిమాన హీరోను ఒకసారి కలవాలన్నది అతని జీవిత ఆశయం. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గత నెల జూన్ 17న స్వయంగా హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లారు. నిరంజన్‌ను ఎంతో ఆత్మీయంగా హత్తుకుని, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించి ధైర్యం చెప్పారు. పవన్ స్టైల్, డైలాగులను అనుకరిస్తూ నిరంజన్ చేసిన వీడియోలను చూసి పవన్ ఎంతో ఆనందించారు. జనసేన డైరీపై ప్రత్యేకంగా ‘ప్రియమైన నిరంజన్‌కు ప్రేమతో..’ అని రాసి సంతకం చేసి ఇచ్చారు.

ఆ భేటీ సమయంలో నిరంజన్ తనకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని చెప్పగా, పవన్ కల్యాణ్ ‘కొని పంపిస్తా చిన్నా’ అని మాట ఇచ్చి, అదే రోజు కుక్కపిల్లను బహుమతిగా పంపించారు. అంతేకాకుండా, ‘ఓజీ 2’ సినిమా తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని, ఇద్దరం కలిసి సినిమా చూద్దామని పవన్ నిరంజన్‌కు ప్రామిస్ చేశారు. తన అభిమాన హీరోతో కలిసి సినిమా చూడాలన్న ఆశ నెరవేరకుండానే నిరంజన్ కన్నుమూయడం పవన్ అభిమానులను, జనసేన నాయకులను తీవ్రంగా కలిచివేస్తోంది. నిరంజన్ మృతి పట్ల స్థానికులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *