KTR: ప్రపంచ బ్యాంక్ (World Bank) విడుదల చేసిన తాజా నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ‘అప్పర్ మిడిల్ ఇన్కం’ (ఎగువ మధ్య స్థాయి ఆదాయం) బెంచ్ మార్కును దాటి ఎదిగిందని ఈ నివేదిక వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే ఈ గొప్ప హోదాను సాధించిన టాప్-5 అగ్ర రాష్ట్రాల్లో మన తెలంగాణ ఒకటిగా నిలవడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన కేటీఆర్.. ‘తెలంగాణ దివాలా తీసింది’ అంటూ రాజకీయ స్వార్థం కోసం దిక్కుమాలిన ప్రచారాలు చేసే వాళ్ల నోళ్లు మూయించడానికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఈ నివేదికే ఒక పవర్ఫుల్ సమాధానమన్నారు. గత పదేళ్ల కిందటి వరకు దరిద్రం తాండవించిన ప్రాంతం కాస్తా.. కేసీఆర్ గారి దార్శనిక పాలన వల్లే నేడు ధనిక రాష్ట్రంగా అవతరించిందని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత అద్భుతంగా ముందుకు దూసుకెళ్లిందో చెప్పడానికి కేవలం జాతీయ నివేదికలే కాకుండా, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సంస్థలే స్టాంప్ వేసి చెబుతున్నాయని గుర్తు చేశారు.
తెలంగాణ వస్తే ఏం పెరిగింది అని అడిగేవారు ఈ నివేదికలను చూడాలని, ఇక్కడ జాతి సంపదతో పాటు జనం ఆదాయం కూడా అద్భుతంగా వృద్ధి చెందిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు బికారులు కాదని, సిరిసంపదలతో తులతూగే తెలంగాణ తల్లి బిడ్డలని అన్నారు. మన రాష్ట్రం విఫలం కాలేదని, సఫల సంపన్న రాష్ట్రంగా సగర్వంగా నిలిచిందని చెప్పారు. తమ చెమటను, నైపుణ్యాన్ని, మేధస్సును ధారపోసి తెలంగాణను శిథిలాల నుంచి శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికీ ఈ సందర్భంగా కేటీఆర్ సెల్యూట్ చేస్తూ శుభాభివందనాలు తెలిపారు.
తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భం ఇది!
సాధించుకున్న స్వరాష్ట్రం సంపన్న రాష్ట్రంగా అవతరించింది!
తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్ కం బెంచ్ మార్క్ ను దాటి ఎదిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది!
దేశంలో ఈ హోదాను సాధించిన ఐదు అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ వుండటం మనకు… pic.twitter.com/3Tw7dKYOHQ
— KTR (@KTRBRS) July 8, 2026
