Encounter: జమ్మూ కశ్మీర్‌లో భారత భద్రతా దళాలు ఉగ్రవాదులపై జరిపిన పోరాటంలో మరో భారీ విజయాన్ని అందుకున్నాయి. షోపియాన్ జిల్లాలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న భారీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతమయ్యాడు. కాల్పుల అనంతరం అధికారులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల జులై 3న స్థానిక తోటల ప్రాంతంలో ఉన్న నిఘా కెమెరాల్లో జాకీర్ గనాయ్‌తో పాటు లతీఫ్ అనే మరో ఉగ్రవాది తిరుగుతున్నట్లు ఆధారాలు దొరికాయి. ఆ సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ (CRPF) బృందాలు కలిసి ఉమ్మడిగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.
ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ నేటితో ఐదో రోజుకు చేరుకుంది. చుట్టుపక్కల దట్టమైన తోటలు ఉండటంతో ఉగ్రవాదులు ఎటువైపు నుంచీ తప్పించుకోకుండా ఆర్మీకి చెందిన ప్రత్యేక విభాగం ‘విక్టర్ ఫోర్స్’ (Victor Force) బయటకు వెళ్లే దారులన్నింటినీ మూసివేసింది. రాత్రి వేళల్లో కూడా ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు వీలుగా అక్కడ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో భద్రతా దళాలు ఉగ్రవాదులు దాక్కున్న చోటికి చేరుకోగానే ఇరువర్గాల మధ్య గట్టిగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే కమాండర్ జాకీర్ అక్కడికక్కడే మరణించగా, అదే ప్రాంతంలో దాక్కున్న లతీఫ్ అనే రెండో ఉగ్రవాది కోసం భారత సైన్యం ప్రస్తుతం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసింది.
