Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లలోని హిందువులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. “పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లలోని హిందువులకు నా హృదయపూర్వక ‘దీపావళి’ శుభాకాంక్షలు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని హిందువులకు, మీరు ఉన్న పరిస్థితిలో శ్రీరాముడు మీకు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
‘భారత్’లో మేమంతా మీ భద్రత కోసం ప్రార్థిస్తున్నాం. ఇవాళ దీపావళి రోజున బంగ్లాదేశ్, పాకిస్థాన్ రెండింటిలోనూ హింసకు గురవుతున్న హిందువుల భద్రత కోసం అందరం ప్రార్థిద్దాం. వారి నేలలలో ధర్మం పునరుద్ధరించబడాలని కోరుకుందాం” అని పవన్ ట్వీట్ చేశారు.
అలాగే సింధి భాషలో ఓ బాలుడు పాడుతున్న పాట తాలూకు వీడియోను జనసేనాని ఈ ట్వీట్‌కు జోడించారు. భారత్ నుంచి విడిపోయామన్న బాధను చెబుతూ ఆ బాలుడు పాడిన పాటను పవన్ రీషేర్ చేశారు. పాకిస్థాన్‌లో ఉంటున్న హిందువులు ఎంత బాధను అనుభవిస్తున్నారో ఆ పెయిన్ ఈ బాలుడి పాటలో తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.