Tragedy

Tragedy: టీచర్ మందలింపుతో ఆరేళ్ల చిన్నారి మృతి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్..!

Tragedy: విశాఖపట్నం పాతబస్తీ వన్‌టౌన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో తరగతి గదిలో టీచర్ మందలించి, చెంపదెబ్బ కొట్టడంతో యూకేజీ (UKG) చదువుతున్న ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

చిన్నారిని హుటాహుటిన కింగ్ జార్జ్ ఆసుపత్రికి (KGH) తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కళ్లముందే అల్లారుముద్దుగా పెరిగిన కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు..
తరగతి గదిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఉపాధ్యాయురాలు క్లాస్‌వర్క్, హోంవర్క్ చెక్ చేస్తుండగా.. సదరు బాలుడు భయంతో తీవ్రంగా ఏడుస్తూ “వద్దు.. వద్దు” అని బతిమిలాడుకున్నట్లు కనిపించింది.
ఆ సమయంలో టీచర్ బాలుడి యూనిఫాంను సరిచేస్తూ, టై పట్టుకుని లాగి చెంపపై ఒక దెబ్బ కొట్టినట్లు దృశ్యాల్లో ఉంది. ఆ దెబ్బ తిన్న వెంటనే గుక్కపెట్టి ఏడుస్తూ ఆ చిన్నారి టీచర్‌ ఒడిపైనే ఒరిగిపోయాడు. ఆమె నిలబెట్టే ప్రయత్నం చేసినా శరీరం సహకరించక అచేతనంగా పడిపోయాడు.

కేజీహెచ్ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన – దర్యాప్తు ముమ్మరం..

ఈ దారుణ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి, పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు..
  • కఠిన చర్యలకు డిమాండ్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని, సదరు ఉపాధ్యాయురాలిపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు.
  • టీచర్ అదుపులోకి: సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సదరు లేడీ టీచర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
  • వైద్యుల నివేదికపై దృష్టి:టీచర్ కొట్టడం వల్లే చనిపోయాడా లేక ముందే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *