Hyderabad : వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం అధికారులపై దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కలెక్టర్ పై దాడి కేసులో 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.విచారణ అనంతరం 16 మంది రైతులకు కోర్టుకు రిమాండ్ చేశారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వగా, పరిగి సబ్ జై లుకు తరలించారు.దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు.
లగచర్లలో అధికారుల ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశ స్థలానికి రైతులెవరూ రాకపోవడంతో కలెక్టర్ అధికారులతో కలిసి లగచర్లకే వెళ్లారని, వెళ్లాక గ్రామస్థులు అధికారులపై ముప్పేట దాడి చేశారని తెలిపారు. బాధ్యులను ఎవరిని వదిలిపెట్టమని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.