Pakistan: పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఓ భయానక ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ఐదంతస్తుల భవనం ఆకస్మికంగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు అని అధికారులు వెల్లడించారు. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
శిథిలాల తొలగింపు తుది దశకు చేరుకుంది. రాత్రిపూట నిర్వహించిన రిస్క్యూ ఆపరేషన్‌లో సహాయక బృందాలు ఇంకా 10 మృతదేహాలను వెలికితీశాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రాణాలతో బయటపడినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కనీసం ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు భారీ యంత్రాలతో పనిచేస్తున్నాయి.
ఈ బిల్డింగ్ 30 సంవత్సరాల క్రితం నిర్మించబడినదిగా, ఇటీవలే శిథిలావస్థకు చేరిందని అధికారులు గుర్తించారు. అయితే, ఈ విషయం గురించి స్థానికుల హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల కోసం అధికారులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.