Weekend OTT Movies: ఈ శుక్రవారం తెలుగులో ఆరు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’తో వస్తున్నాడు. అలానే సత్యదేవ్ ‘జీబ్రా’ మూవీ కూడా శుక్రవారమే విడుదల అవుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ ‘దేవికీ నందన వాసుదేవ’తో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. అలానే జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ హీరోగా నటించి నిర్మించిన సినిమా ‘కేశవ చంద్ర రమావత్’ కూడా ఫ్రైడే వస్తోంది. దీనితో పాటే ‘సినిమా పిచ్చోడు’ అనే చిత్రమూ విడుదల అవుతోంది. ఇవన్నీ స్ట్రయిట్ తెలుగు సినిమాలు కాగా… తమిళ అనువాద చిత్రం కూడా ఒకటి ఈ శుక్రవారం విడుదల అవుతోంది. అదే సన్నీ లియోన్ నటించిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘మందిర’. కొమ్ములపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్. యువన్ దర్శకత్వం వహించారు. ‘మందిర’గా టైటిల్ రోల్ ను సన్నీ లియోన్ పోషించింది. ఇప్పటికే తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగువారినీ ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని నిర్మాత వ్యక్తం చేస్తున్నారు.