Murder: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. ప్రముఖ ఐటీ హబ్‌కు సమీపంలోని కోకాపేట నియోపోలిస్ (Kokapet Neopolis) వద్ద ఓ వ్యక్తి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతుడు ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ – అసలేం జరిగింది?..
హత్యకు గురైన వ్యక్తిని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన వెంకన్న (45)గా పోలీసులు గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యులు స్వగ్రామంలోనే నివసిస్తుండగా.. వెంకన్న నగరంలో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో పీజీ/పీహెచ్డీ రీసెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కోకాపేట్‌లోని ఓ ప్రైవేట్ పీజీ హాస్టల్లో ఉంటున్నట్లు తెలిసింది.
వెంకన్న మృతదేహాన్ని పరిశీలించగా ఆయన తల భాగంలో తీవ్రమైన రక్తగాయాలు ఉన్నాయి. దుండగులు క్రికెట్ బ్యాట్‌తో లేదా ఇతర బరువైన మొరటు ఆయుధాలతో తలపై బలంగా బాది హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఎక్కడో చంపి.. ఇక్కడ పడేశారా? – పోలీసుల అనుమానాలు..
వెంకన్నను ఘటనా స్థలంలోనే చంపారా లేక వేరే ప్రాంతంలో హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కోకాపేట నియోపోలిస్ నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చి పడేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కోకాపేట్, ఔటర్ రింగ్ రోడ్డు, నియోపోలిస్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల విజువల్స్‌ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి ఆ ప్రాంతానికి వచ్చిన అనుమానాస్పద వాహనాల వివరాలను సేకరిస్తున్నారు.మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ హత్యకు పాత కక్షలు కారణమా? లేక వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీల వివాదాలు ఏమైనా ఉన్నాయా? అన్న దానిపై నార్సింగి పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
