పుట్టినప్పటి నుంచి ఆస్తుల లెక్కలు తీద్దాం.. దమ్ముందా?..
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా తిప్పికొట్టారు. మా ఆస్తులు, నీ ఆస్తులపై సమగ్ర విచారణకు నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి? పుట్టిన కాడి నుంచి లెక్కలు తీద్దాం. కేసీఆర్ గారు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు.. అలాగే నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు సంపాదించిన ఆస్తులన్నింటిపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేయిద్దాం. ఇద్దరం కలిసి జడ్జికి లేఖ రాద్దాం, నీకు ఆ దమ్ముందా? ఆ విచారణలో మాది తప్పని తేలితే న్యాయమూర్తి ఏ శిక్ష వేసినా భరించడానికి మేం సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసిరారు.
చింతమడకలో మా తాతకు వందల ఎకరాలుండేవి..
తాము నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు సంపాదించలేదని.. తమ తాత కాలంలోనే సిద్దిపేట జిల్లా చింతమడకలో వందల ఎకరాల భూములు ఉండేవని స్పష్టం చేశారు. కావాలంటే ఆ భూముల పూర్తి వివరాలు, రికార్డులను కూడా సీఎం రేవంత్‌కే స్వయంగా పంపిస్తానని చెప్పారు.
హోటల్ వ్యాపారం చేయడం నేరమా? – ఏదో కనిపెట్టినట్టు బిల్డప్..
నేను 2006లోనే ఒక హోటల్ ప్రారంభించాను. ఇప్పుడు నాకు మూడు హోటల్స్ ఉన్నాయి. వ్యాపారం చేసుకుని బతకడం తప్పా? ఈ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్లోనే స్పష్టంగా పెట్టాను. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న సమాచారాన్ని ప్రజల ముందు చదివి, ఏదో కొత్త విషయం కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి బిల్డప్ ఇస్తున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్‌లను మించి రేవంత్ రెడ్డి తెగ యాక్టింగ్ చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.
శత్రుదేశం మీదికి వెళ్లినట్టు సిరిసిల్లకు వెళ్లారు – డైవర్షన్ పాలిటిక్స్..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేకనే ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం పర్యటనల్లో ప్రజల కంటే పోలీసులే ఎక్కువగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఏంటో, ఆయన బాధ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.
సిరిసిల్లలో 35 మంది నేతన్నల ఆత్మహత్యలు..
కాంగ్రెస్ పాలన వచ్చాక ఒక్క సిరిసిల్లలోనే 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వారిని ఆదుకుంటారని అనుకుంటే.. ఏదో శత్రుదేశం మీదకు దండయాత్రకు వెళ్లినట్టు సిరిసిల్లకు వెళ్లి హంగామా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు 6 గంటల కరెంట్ కూడా లేదు..
రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఆరు గంటల విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ వేసిన విచారణ కమిషన్లు అన్నీ తుస్సుమన్నాయని చెప్పారు. మోసపోతే గోసపడతారని నాడు కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరసత్యాలు అయ్యాయని.. ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.