High Court: పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది రెండు కుటుంబాల అనుబంధం. పాత రోజుల్లో భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోయేవారు. కానీ నేటి కాలంలో పరిస్థితి మారిపోయింది. చిన్న కారణాలకే కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఒక వ్యక్తి నా భార్య వంట చేయడం లేదు, ఇది నన్ను హింసించడమే అంటూ విడాకుల కోసం హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఎల్బీనగర్‌కు చెందిన ఒక వ్యక్తికి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే మహిళతో వివాహమైంది. పెళ్లైన ఏడాదిన్నరకే వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. తన భార్య ఉదయం పూట వంట చేయడం లేదని, కనీసం అత్తగారికి వంటలో సాయం కూడా చేయడం లేదని సదరు భర్త కోర్టుకు ఫిర్యాదు చేశాడు. ఇది తనను మానసికంగా క్రూరంగా హింసించడమేనని, కాబట్టి తనకు విడాకులు కావాలని కోరాడు. గతంలో కింది కోర్టు ఇతని అభ్యర్థనను తిరస్కరించగా, ఆయన మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేశాడు.
ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం భర్త వాదనను తోసిపుచ్చింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వం ఎలా అవుతుంది? అని కోర్టు ప్రశ్నించింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు ఒకరి పనివేళలను మరొకరు అర్థం చేసుకోవాలని సూచించింది. భార్య ఉదయం 9 గంటలకే ఆఫీసుకు వెళ్తున్నప్పుడు, ఆమె వంట చేయలేకపోవడంలో తప్పులేదని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఈ ఒక్క కారణంతో విడాకులు మంజూరు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
ముఖ్యంగా, అత్తగారికి వంటలో సాయం చేయకపోవడాన్ని “హింస”గా పరిగణించలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. సంసారంలో చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజమని, అంత మాత్రానికే విడాకులు తీసుకోవాలని చూడటం సరికాదని హితవు పలికారు. పని ఒత్తిడిలో ఉన్న మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొంటూ, భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
