Crime News

Crime News: అల్లుడిని కాల్చి చంపిన అత్తామామలు.. ట్రాన్స్‌జెండర్ వివాదమే కారణమా?

Crime News: అమెరికాలోని కాలిఫోర్నియాలో అత్యంత షాకింగ్ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ (The New York Times) టెక్ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న జొనాథన్ మెకిన్సే (40) దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను సొంత అత్తమామలే పట్టపగలు తుపాకీతో కాల్చి చంపినట్లు తేలడం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి మెకిన్సే భార్య తల్లిదండ్రులైన షౌయోంగ్ జాంగ్ (77), షిలీ చెన్ (77)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పార్కింగ్ లాట్‌లో తూటాల వర్షం..
శాన్ ఫ్రాన్సిస్కోకు సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న డబ్లిన్ నగరంలోని ‘డబ్లిన్ స్పోర్ట్స్ గ్రౌండ్స్’ పార్కింగ్ ప్రదేశంలో ఈ దాడి జరిగింది. వరుసగా తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని, మెకిన్సే తల, ఛాతీ భాగాల్లో తీవ్ర బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాల్పుల తర్వాత ఏమీ తెలియనట్లు నడుచుకుంటూ..
దాడి చేసిన వృద్ధ దంపతులు కాల్పులు జరిపిన వెంటనే ఆందోళన చెందకుండా సాధారణంగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించిందని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందిన కొద్ది నిమిషాల్లోనే అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసు అధికారి ఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్న ఆ వృద్ధ దంపతులను అరెస్ట్ చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మెకిన్సే ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
హత్య వెనుక పాత కక్షలు – ట్రాన్స్‌జెండర్ గుర్తింపుపై వివాదం?..
హత్యకు గల ఖచ్చితమైన కారణాన్ని పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించనప్పటికీ, కోర్టు రికార్డులను పరిశీలిస్తే మెకిన్సే ఇంకా ఆయన భార్య కాండిస్ జాంగ్ కుటుంబం మధ్య కొన్నేళ్లుగా తీవ్ర గృహహింస, వివాదాలు కొనసాగుతున్నట్లు తెలిసింది.
ట్రాన్స్‌జెండర్ అస్తిత్వంపై వేధింపులు..
జొనాథన్ మెకిన్సే గతంలో స్త్రీ నుంచి పురుషుడిగా మారిన (ట్రాన్స్‌జెండర్) వ్యక్తి. తన ట్రాన్స్ గుర్తింపు కారణంగా భార్య, ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా దూషించేవారని, శారీరకంగా వేధించేవారని మెకిన్సే గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పాత ఆరోపణలు..
2010లో తాను డబుల్ మాస్టెక్టమీ శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న సమయంలో మామ తన ఛాతీపై గుద్దాడని, సర్జికల్ ట్యూబ్‌లను భార్య లాగేయడానికి ప్రయత్నించిందని మెకిన్సే ఆరోపించారు. 2013లో భార్య తనను ఫ్రైయింగ్ పాన్‌తో కొట్టిందని, అత్తగారు తనను ‘వికృత జీవి’, ‘మాన్‌స్టర్’ అంటూ నిందించారని గత రికార్డుల్లో పేర్కొన్నారు.
భార్య ఎదురుదాడి ఆరోపణలు..
అటు భార్య కాండిస్ జాంగ్ కూడా మెకిన్సేపై గతంలో పలు ఆరోపణలు చేశారు. గొడవ సమయంలో తన వెన్నుపూస విరిగేలా కిందపడేశాడని, తన తల్లిని మానసికంగా వేధించాడని ఆరోపించారు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు రెస్ట్రయినింగ్ ఆర్డర్లు (రక్షణ ఉత్తర్వులు) పొందారు. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు.
జైల్లో వృద్ధ దంపతులు – కొనసాగుతున్న విచారణ
నిందితులైన 77 ఏళ్ల షౌయోంగ్ జాంగ్, షిలీ చెన్‌లను శాంటా రీటా జైలుకు తరలించారు. వీరిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ (ముందస్తు ప్రణాళికతో కూడిన హత్య), నేరపూరిత కుట్ర, తీవ్ర నిర్లక్ష్యంతో తుపాకీని ఉపయోగించడం మరియు పిల్లలను ప్రమాదంలోకి నెట్టడం (చైల్డ్ ఎండేంజర్‌మెంట్) వంటి తీవ్రమైన నాన్‌బెయిలబుల్ అభియోగాలు నమోదు చేశారు.

మృతి చెందిన జొనాథన్ మెకిన్సే 2023 నుంచి ది న్యూయార్క్ టైమ్స్‌లో ‘డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ గేమ్స్ ప్లేయర్ ఎక్స్‌పీరియన్స్’గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన స్ప్లంక్, కోర్సెరా, ఒరాకిల్ వంటి అగ్రశ్రేణి ఐటీ సంస్థల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా కీలక ఇంజనీర్‌గా సేవలందించారు. ఆయన మృతిపై న్యూయార్క్ టైమ్స్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *