Anagani Satya Prasad

Anagani Satya Prasad: బాబాయి హత్య గురించి జగన్‌ ఎందుకు మాట్లాడరు?

Anagani Satya Prasad: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిప్పులు చెరిగారు. వైసీపీ అంటే పూర్తిగా అబద్ధాలు, కుట్రలతో నడిచే పార్టీ అని, శవ రాజకీయాలు చేయడం వారికి అలవాటుగా మారిపోయిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువులు, మహిళలు అంటే ఆ పార్టీకి కనీస గౌరవం లేదని ధ్వజమెత్తారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీని మించిన వారు లేరని విమర్శించారు. మీడియాతో మాట్లాడిన మంత్రి అనగాని సత్యప్రసాద్.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, సీబీఐ విచారణ తీరుపై జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ పేరును ‘గొడ్డలి డైవర్షన్ పార్టీ’గా మార్చాలి”..

సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యను గత ఐదేళ్ల పాలనలో మసిపూసి మారేడుకాయ చేశారని మంత్రి ఆరోపించారు. “సొంత బాబాయి హత్యపై వైఎస్ జగన్ ఎందుకు నోరు మెదపరు? అసలు ఆ హత్య గురించి మాట్లాడటానికి ఆయనకు ఎందుకు అంత భయం?” అని నిలదీశారు. వైసీపీ పార్టీ పేరును ‘గొడ్డలి డైవర్షన్ పార్టీ’గా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్ డీఎన్‌ఏలోనే అరాచకం, హత్యలు, కుట్రలు ఉన్నాయని మంత్రి అనగాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివేకా హత్య కేసులో కీలక నిందితులు, సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో చనిపోతుంటే ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
నాడు సీబీఐ వద్దు.. నేడు ముద్దు..
గతంలో తమకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) పై నమ్మకం లేదని స్వయంగా ప్రకటనలు చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం ప్రతి చిన్న విషయానికి, ఇతర కేసులకు సీబీఐ విచారణ కావాలంటూ డిమాండ్లు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తమ స్వార్థం, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా దర్యాప్తు సంస్థలపై మాట్లాడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ మానాలి..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుంటే.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని, ఇప్పటికైనా దిగజారుడు డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని జగన్‌కు మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *