Nara lokesh: రాష్ట్రంలో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్లు) బదిలీల విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేస్తూ, బదులుగా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ అధికారికంగా వెల్లడించారు.
ఇటీవల ప్రభుత్వం పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే ఎస్జీటీ బదిలీల విషయంలో కొన్ని అభ్యంతరాలు, సమస్యలు వెలుగు చూశాయి. ప్రాథమికంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, దీనిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీలతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. వారి సూచనలతో పాటు అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, చివరికి మాన్యువల్ కౌన్సెలింగ్ విధానానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా ఉపాధ్యాయుల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభించనుంది.