Nara Lokesh

Nara Lokesh: విశాఖలో ‘పి.వి. సింధు స్పోర్ట్స్ అకాడమీ’కి నారా లోకేష్ శంకుస్థాపన!

Nara Lokesh: విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ క్రీడారంగంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. భారత ఒలింపిక్ విజేత పి.వి. సింధు ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘పి.వి. సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ (PV Sindhu Centre for Sports Excellence) అకాడమీకి రాష్ట్ర విద్యా, ఐటీ, సమాచార శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఘనంగా భూమిపూజ మరియు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సింధు తల్లిదండ్రులు పి.వి. రమణ, విజయలతో పాటు వందలాది మంది చిన్నారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

సింధు ప్రయాణం.. భావితరాలకు స్ఫూర్తిప్రదాయకం

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. సింధు క్రీడా ప్రయాణాన్ని మరియు విజయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగంగా ప్రసంగించారు:

హైదరాబాద్ నగరం నిద్రలేవక ముందే ఒక చిన్నారి కష్టపడి ప్రాక్టీస్ చేసేది. కెమెరాలు, మెడల్స్, హెడ్‌లైన్స్ లేని రోజుల్లో కేవలం క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగింది. ఈ రోజు మన సింధు ఒలింపిక్ మెడలిస్ట్ మాత్రమే కాదు.. దేశం గర్వించదగ్గ దిగ్గజం! విజయం వెనుక ఉన్న కష్టం, తల్లిదండ్రుల నిరంతర శ్రమ, కోచ్‌ల మద్దతును మనం మరువలేం.

బ్యాడ్మింటన్ మాత్రమే కాదు.. మల్టీ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్!

సింధు మొదట బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో దీనిని అన్ని రకాల క్రీడల శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు లోకేష్ తెలిపారు.

  • అందుబాటులో ఉండే క్రీడలు: ఈ అకాడమీలో బ్యాడ్మింటన్‌తో పాటు స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్ ఇంకా ఫుట్‌బాల్ క్రీడలకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించనున్నారు.

  • 18 నెలల డెడ్‌లైన్: రాబోయే 18 నెలల్లో (మే 2028 నాటికి) అకాడమీ నిర్మాణ పనులను పూర్తి చేసి రిబ్బన్ కటింగ్ జరగాలని, దానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

తరగతి గది తెలివితేటలు ఇస్తుంది.. ఆటలు క్యారెక్టర్‌ను నిర్మిస్తాయి!

విద్యాశాఖ మంత్రిగా విద్యా, క్రీడల ప్రాధాన్యతను వివరిస్తూ..

  • “తరగతి గది ఎలా ఆలోచించాలో నేర్పిస్తే.. క్రీడా మైదానం ఎలా పోరాడాలో నేర్పుతుంది.”

  • అందుకే ఏపీలో శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’ (No Bag Day)గా మార్చి, పిల్లలు కోరుకున్న క్రీడల్లో శిక్షణ పొందేలా ప్రభుత్వం క్రీడా పరికరాలను సమకూరుస్తుందన్నారు.

  • ప్రతీ పాప, బాబు డాక్టర్ లేదా ఇంజనీర్ కాకపోవచ్చు, కానీ ప్రతీ చిన్నారిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దానిని వెలికితీయడమే ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.

మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సింధుతో కలిసి ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని, ‘ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం చదువులు, పరిశ్రమలే కాదు.. అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేసే గడ్డ’గా మార్చడమే తమ లక్ష్యమని నారా లోకేష్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *