Viral News: భారతదేశంలో వినోదానికి అత్యంత ప్రధాన సాధనాలు క్రికెట్, సినిమా. ఈ రెండూ కలిస్తే ప్రేక్షకులకు లభించే మజానే వేరు. సినీ తారలు క్రికెట్ బ్యాట్ పట్టడం, స్టార్ క్రికెటర్లు సినిమా పాటలు, ఐకానిక్ డైలాగ్స్‌కు రీల్స్ చేసి సందడి చేయడం తరచూ చూస్తుంటాం. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ తెలుగు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకునే ఒక క్రేజీ రీల్‌తో ముందుకొచ్చారు.
మైదానంలో ఎంత దూకుడుగా ఉంటారో, మైదానం వెలుపల అంతటి సరదా మనుషులుగా ధావన్, చాహల్‌కు మంచి పేరుంది. వీరిద్దరూ తాజాగా కలిసి దివంగత ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందంల సూపర్ హిట్ కామెడీ సీన్‌ను రీక్రియేట్ చేశారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా 2011లో వచ్చిన ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పలరాజు’ చిత్రంలోని కామెడీ సీన్ ఎంతటి ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో రౌడీ షీటర్ రోల్లో కనిపించిన బ్రహ్మానందం సినిమాకు ఫైనాన్స్ చేస్తూ, తను రాసిన పాటలనే పెట్టాలని కండీషన్ పెడతాడు. ఈ క్రమంలో ఆయన పక్కనే సెక్యూరిటీ గార్డుగా ఉండే వేణు మాధవ్.. బ్రహ్మానందం ఏ అసంబద్ధమైన మాట చెప్పినా వెనుక నుంచి అత్యుత్సాహంతో ‘వా అన్నా వా’ అంటూ ఆకాశానికెత్తేస్తుంటాడు. ఈ సీన్, డైలాగ్ సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ మీమ్ మెటీరియల్‌గా స్థిరపడిపోయింది.
ఇప్పుడు ఇదే పాపులర్ సీన్‌ను శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా ఇమిటేట్ చేశారు. ఇందులో శిఖర్ ధావన్ బ్రహ్మానందంలా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగా, వెనుక నుంచి చాహల్ అచ్చం వేణు మాధవ్‌లా మారి ‘వా అన్నా వా’ అంటూ బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టాడు.
ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తెలుగులోని లెజెండరీ కమెడియన్ల సీన్‌ను నార్త్ ఇండియన్ క్రికెటర్లు ఇంత పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేయడాన్ని చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వేణు మాధవ్ మేనరిజాన్ని చాహల్ పక్కాగా దించేశాడని, “ఇది నిజమేనా.. చాహల్ టైమింగ్ సూపర్బ్” అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Ex Indian Cricketer #ShikharDhawan and #Chahal via Instagram mimicking Late Comedian Venu Madhav garu’s dialogue https://t.co/7P23QEacTt
— Movies4u Official (@Movies4u_Officl) November 3, 2026
