KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోటికొచ్చిన అబద్ధాలు, నెరవేర్చలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెడుతోందని విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.
మియాపూర్ భూములు అమ్ముతారా? అమరవీరులకు కేటాయించండి
మియాపూర్‌లోని 550 ఎకరాల విలువైన భూముల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
-
బీఆర్ఎస్ కాపాడిన భూమి: గత ప్రభుత్వ హయాంలో 550 ఎకరాల మియాపూర్ భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడిందని, రేవంత్ సీఎం అయ్యాక ఆ భూములపై కోర్టు తీర్పు వచ్చిందని గుర్తుచేశారు.
-
ఎర్రవెల్లిలో కాదు.. మియాపూర్‌లో కట్టండి: కేసీఆర్ ఉంటున్నారన్న అక్కసుతో ఎక్కడో 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రవెల్లిలో అమరవీరుల కాలనీ కడతామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అంత చిత్తశుద్ధి ఉంటే నగర నడిబొడ్డున ఉన్న మియాపూర్ భూముల్లోనే అమరవీరులకు కాలనీలు నిర్మించాలని సవాల్ విసిరారు.
-
భూముల కేటాయింపుపై ప్రతిపాదన: 550 ఎకరాల్లో 200 ఎకరాలు నగర పేదల డబుల్ బెడ్రూమ్ టవర్లకు, 100 ఎకరాలు అమరవీరుల కుటుంబాలకు, మరో 100 ఎకరాలు ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వడానికి, మిగిలిన స్థలాన్ని పేద విద్యార్థుల కోసం స్కూళ్లు, కాలేజీల నిర్మాణానికి కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మూడేళ్లయినా అమలవని గ్యారెంటీలు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చిందని, మూడు నెలల్లో నెరవేరుస్తామని చెప్పి మూడేళ్లు గడిచినా ఒక్క గ్యారెంటీని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు.హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, నగరంపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్ నేతల మాటలను నగర ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని స్పష్టం చేశారు.
పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక.. హిల్ట్ పాలసీ స్కాంలో భాగస్వాములు కావద్దు
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP) పేరుతో భారీ భూకుంభకోణం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఈ భూముల వ్యవహారంలో లేదా హిల్ట్ పాలసీ స్కాంలో భాగస్వాములైతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మమ్మల్ని నిందించవద్దు. ప్రజల ఆశీర్వాదంతో ఏడాది లోపలే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, కొత్త ప్రభుత్వం రాగానే ఈ అక్రమ భూకేటాయింపులు, వేలాలపై సమగ్ర విచారణ జరిపి వాటన్నింటికీ చెక్ పెడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన హైదర్‌నగర్ డివిజన్ నేత దామోదర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
