Nani: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా భారీ విజయం సాధించిన సందర్భంగా మూవీ టీమ్ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కొలువైన ప్రసిద్ధ మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను మంగళవారం దర్శించుకుంది. హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మూవీ టీమ్ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవార్లకు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. నాని మేడారానికి వచ్చారని తెలుసుకున్న స్థానికులు, గిరిజనులు, అభిమానులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట – తొలిరోజే రూ.80 కోట్లు..
‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల-సుధాకర్ చెరుకూరి కాంబో రిపీట్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచే భారీ హైప్ నెలకొంది. అందుకు తగ్గట్టే సెప్టెంబర్ 24న రిలీజైన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా మొదటి రోజే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇది నాని సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్గా సరికొత్త రికార్డు సృష్టించింది.
కథా నేపథ్యం & ఊరమాస్ లుక్..
1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అణచివేతకు గురైన ఒక గిరిజన తెగ తమ హక్కులు, గుర్తింపు కోసం చేసిన పోరాటాన్ని చూపించారు. ఇందులో ‘జడల్’ అనే ఊరమాస్ పాత్రలో నాని ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్, నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మోహన్ బాబు ‘శికంజా మాలిక్’ అనే ప్రతినాయక పాత్రలో మెప్పించగా.. రాఘవ్ జుయల్, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.
కేసీఆర్ పోలికలతో ‘శంకరన్న’ పాత్ర – రాజకీయ దుమారం..
సినిమాలో చూపించిన ‘శంకరన్న’ (ఎమ్మెల్యే శంకర్ రావు) పాత్ర హావభావాలు, మ్యానరిజమ్లు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలి ఉన్నాయంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర దుమారం రేగింది. కొందరు ఉద్దేశపూర్వకంగా సినిమాపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, మెజారిటీ ప్రేక్షకుల నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది.
Natural Star @NameisNani and #TheParadise team had darshan and performed the rituals at the sacred Sri Sammakka Saralamma Devasthanam in Medaram ✨🙏 pic.twitter.com/2T6vGiLdqo
— THE PARADISE (@TheParadiseOffl) September 29, 2026
