Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాల అనంతరం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సుస్మిత వివాదం నేపథ్యంలో మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆమె, మంగళవారం వరంగల్ జిల్లా రాజకీయాల్లో మళ్లీ దూకుడు ప్రదర్శించారు. తమను విమర్శించే ప్రతిపక్ష నేతలకు, విమర్శకులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF), కల్యాణలక్ష్మి కింద 112 చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.
మగవాళ్ల దాకా అవసరం లేదు.. ఒక్కో ఆడబిడ్డే నలుగురిని కొడుతుంది..
మాపై ఎవరైనా అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోం. మా అనుచరులపై ఈగ వాలినా సహించేది లేదు. సమాధానం చెప్పడానికి మా మగవాళ్ల వరకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మా వర్గంలోని ఆడవాళ్లే చాలు.. ఒక్కో మహిళ నలుగురిని కొడుతుంది జాగ్రత్త. ఎక్కడ దొరికితే అక్కడ చిత్తుచిత్తుగా చితకబాదుతాం” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు హద్దులు దాటి మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నేతలు గాల్లో కత్తులు తిప్పడం మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
మంత్రి పదవి పోయినందుకు నాకేం బాధ లేదు..
మంత్రి పదవి నుంచి తొలగించడంపై కొండా సురేఖ స్పందిస్తూ.. ఆ నిర్ణయం వల్ల తనకు ఎలాంటి విచారం లేదని స్పష్టం చేశారు. “మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బాధ్యతలు ఉండేవి. ఇప్పుడు నాకు పూర్తి సమయం దొరికింది. ఒక ఎమ్మెల్యేగా వరంగల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం దక్కింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను పరిష్కరిస్తా” అని వెల్లడించారు.
రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ నాయకులంతా వర్గ విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మంత్రి పదవి పోయినా తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని పునరుద్ఘాటించారు.
ఎంజీఎం ఘటన & బీజేపీ, బీఆర్ఎస్లపై విమర్శల దాడి..
ఇటీవల ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులూడిన ఘటనపై బీఆర్ఎస్ చేస్తున్న నిరసనలను కొట్టిపారేశారు. “ఆ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం అందరి అదృష్టం. కానీ బీఆర్ఎస్ నేతలు అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాళ్లకు వాళ్లే తోసేసుకుని.. పోలీసులు కొట్టారంటూ ఆసుపత్రుల్లో చేరి డ్రామాలు ఆడారు” అని ఎద్దేవా చేశారు. త్వరలోనే అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పేద ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
కొత్త కలెక్టరేట్ పనులు దాదాపు పూర్తయ్యాయని, కేవలం ఫర్నిచర్, రంగుల పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అవగాహన లేకుండా బీజేపీ నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. “వరంగల్‌లోని చారిత్రక, పురాతన ప్రదేశాల అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురండి.. ఆ తర్వాత వచ్చి వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడండి” అంటూ బీజేపీ నేతలకు కొండా సురేఖ సవాల్ విసిరారు.
