Nani

Nani: నాని పని రాక్షసుడు..! నెగటివ్ కామెంట్స్ పైన స్పందించిన జిమ్ ట్రైనర్ విశ్వా భారత్

Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘ప్యారడైజ్’ (Paradise) షూటింగ్‌లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నానిపై కొందరు చేస్తున్న నెగటివ్ కామెంట్స్ పట్ల ఆయన పెర్సనల్ జిమ్ ట్రైనర్ విశ్వా భారత్ తీవ్రంగా మండిపడ్డారు. నాని సినిమా కోసం ఎంతలా శ్రమిస్తారో తనకు తెలుసని, ఆయన నిబద్ధతను విమర్శించే వారిపై సీరియస్ అయ్యారు.

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే నానిని నెటిజన్లు టార్గెట్ చేయడంపై విశ్వా భారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని క్రమశిక్షణ, సినిమా పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని వివరిస్తూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

నాని ఒక పని రాక్షసుడు!

నాని గురించి విశ్వా భారత్ మాట్లాడుతూ.. “నాని నిజమైన పని రాక్షసుడు. సినిమా కోసం ఆయన ఎంత కష్టానికైనా వెనకాడరు. ప్రస్తుతం చేస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా కోసం ఆయన పడుతున్న శ్రమ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి, గంటలోపు సిద్ధమై సెట్స్‌కు చేరుకుంటారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు షూటింగ్‌లో పాల్గొంటారు. దాదాపు 12 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసి ఇంటికి రాగానే, అలసటను పక్కన పెట్టి వెంటనే 45 నిమిషాల పాటు జిమ్‌లో కఠినమైన శిక్షణ తీసుకుంటారు” అని వెల్లడించారు.

ఎంత ఒత్తిడి ఉన్నా, షూటింగ్ ఆలస్యమైనా ‘ఈరోజు జిమ్ వద్దు’ అని నాని ఎప్పుడూ చెప్పరని, అలాంటి వ్యక్తిపై సోషల్ మీడియాలో విమర్శలు చూస్తే తనకు రక్తం మరుగుతుందని (బీపీ పెరుగుతుందని) ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శరీర ఆకృతిలో భారీ మార్పులు

‘ప్యారడైజ్’ సినిమా కోసం నాని తన బాడీని పూర్తిగా మార్చుకుంటున్నారు. ఈ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రక్రియను ఆయన ‘హిట్-3’ షూటింగ్ సమయంలోనే ప్రారంభించారని ట్రైనర్ తెలిపారు. గతంలో ‘జెర్సీ’ సినిమా కోసం కూడా నాని ప్రొఫెషనల్ క్రికెటర్ తరహాలో కఠినమైన శిక్షణ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *