Murali mohan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖులతో ఈరోజు జరిగిన భేటీలో అల్లు అర్జున్ వివాదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించలేదని, కానీ పరిశ్రమ సంబంధ సమస్యలపై సాధారణంగా చర్చించారని నటుడు మురళీమోహన్ తెలిపారు. ఈ సమావేశం పూర్తిగా సినిమా పరిశ్రమకు సంబంధించినదేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, పరిశ్రమలో చిన్న సమస్యలు, విభేదాలు ఉంటే వాటిని సమన్వయంతో పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని సీఎం సూచించారన్నారు. పరిశ్రమకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని, అయితే పరిశ్రమ కూడా ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందించాలని కోరినట్లు వెల్లడించారు.
బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరల పెంపు అంశాలపై పునరాలోచన చేయనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే, త్వరలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు, పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన ఎంతో బాధించిందన్నారు. పరిశ్రమలో పోటీ పెరిగిందని, ఈ కారణంగా ప్రమోషన్ చాలా కీలకమైందని చెప్పారు. సినిమాల విడుదల మొదటి రోజు ఎలక్షన్ ఫలితాల వలె మారిందని, ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతున్నందున విస్తృత ప్రమోషన్ అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు.