Mana Cinema First Reel: ప్రముఖ జర్నలిస్ట్ రెంటాల జయదేవ రాసిన ‘మన సినిమా – ఫస్ట్ రీల్’ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఓ ప్రముఖ రచయిత పీహెచ్ డీ గ్రంథం రాస్తే ఎలా ఉంటుందో ఈ పుస్తకం అలా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా మీద ప్రేమ ఉన్న వ్యక్తి పుస్తకం రాస్తే ఎంత ప్రామాణికంగా ఉంటుందో జయదేవ నిరూపించాడని ఆయన అన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం తొలి ప్రతిని ఐ.ఆర్.ఎస్. అధికారి కృష్ణ కౌండిన్యకు, మలి ప్రతిని ప్రచురణకర్త ‘ఎమెస్కో’ విజయ్ కుమార్ కు త్రివిక్రమ్ అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాష – సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య డి. చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ కవి – విమర్శకులు అఫ్సర్, రచయిత్రి కల్పనా రెంటాల, దర్శకులు దశరథ్ తదితరులు పాల్గొన్నారు. మూడున్నర దశాబ్దాలుగా సినిమా గురించి రాస్తున్నా… ఇదే తన తొలి సినిమా పుస్తకమని రెంటాల జయదేవ తెలిపారు.
Shabdham: ఫిబ్రవరి 28న రాబోతున్న ‘శబ్దం’
Shabdham: ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వంలో గతంలో ‘వైశాలి’ చిత్రం వచ్చింది. ఈ హారర్ ధ్రిల్లర్ మూవీ చక్కని విజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ‘శబ్దం’ అనే మూవీని చేశారు. సెవన్ జి ఫిలిమ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ షూటింగ్ ముంబాయి, మున్నార్, చెన్నయ్ లో జరిగింది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో 120 ఏళ్ళనాటి లైబ్రరీ సెట్ ను నిర్మించారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లే, ఎమ్మెస్ భాస్కర్, రాజీవ్ మీనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. మరి ‘వైశాలి’ తరహాలో ఈ చిత్రమూ విజయం సాధిస్తుందేమో చూడాలి.