Mohan Babu: విలక్షణ నటుడు, నిర్మాత, విద్యావేత్త మోహన్ బాబు ఇవాళ్టితో నటుడిగా 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన నటించిన ‘స్వర్గం నరకం’ చిత్రం సరిగ్గా 49 సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదలైంది. ఇప్పటికీ నటుడిగా, నిర్మాతగా మోహన్ బాబు చురుకైన పాత్రను పోషించడం విశేషం. మంచు విష్ణు హీరోగా ‘కన్నప్ప’ చిత్రాన్ని నిర్మిస్తున్న మోహన్ బాబు అందులో మహదేవ శాస్త్రి అనే ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. తన తండ్రి మోహన్ బాబు నట స్వర్ణోత్సవాలను డిసెంబర్ నుండి వచ్చే నవంబర్ వరకూ జరుపబోతున్నట్టు మంచు విష్ణు తెలిపారు. ఓ నటుడిగా ఉంటూ అత్యధికంగా 75 చిత్రాలను నిర్మించిన వ్యక్తి తన తండ్రి అని విష్ణు చెప్పారు.