Crime News

Crime News: మేడ్చల్ జిల్లాలో ప్రియుడి మోజులో భర్తను చంపేసింది

Crime News: నాగరిక సమాజం తలదించుకునే ఘటన మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసింది. కట్టుకున్న భర్తను కాదని, పరాయి వ్యక్తితో పెంచుకున్న మోజు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన ప్రేమకు అడ్డువస్తున్నాడని భావించిన ఓ భార్య, ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హతమార్చింది. హృదయ విదారకమైన ఈ ఘటన బోడుప్పల్‌లోని ఈస్ట్ బృందావన్ కాలనీలో సంచలనం సృష్టించింది.

అసలేం జరిగింది?

వివరాల్లోకి వెళ్తే.. వి.జే. అశోక్ (45) ఒక ప్రైవేట్ కాలేజీలో లాజిస్టిక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య పూర్ణిమ స్థానికంగా ఒక ప్లే స్కూల్ నడుపుతోంది. గత 18 నెలల క్రితం వీరు ఈ కాలనీకి మారారు. అయితే, గతంలో వీరు నివసించిన ప్రాంతంలో భవన నిర్మాణ పనులు చేసే పలేటి మహేష్‌(22)తో పూర్ణిమకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.

గొడవలే హత్యకు బీజం..

వీరి సంబంధంపై అనుమానం వచ్చిన అశోక్, పలుమార్లు భార్యను మందలించారు. అయినప్పటికీ పూర్ణిమ తీరు మారలేదు. ఈ నెల 10న మహేష్ తమ ఇంటి సమీపంలో కనిపించడంతో అశోక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను మరోసారి హెచ్చరించారు. దీంతో అశోక్ ప్రాణాలు తీస్తేనే తాము ప్రశాంతంగా ఉండగలమని భావించిన పూర్ణిమ, ప్రియుడు మహేష్‌తో కలిసి పక్కా స్కెచ్ వేసింది.

ఇది కూడా చదవండి: TG Assembly: నీళ్లు-నిజాలు.. ఈనెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

సినిమా ఫక్కీలో హత్య..

పథకం ప్రకారం, ఈ నెల 11న మహేష్ తన స్నేహితుడు భూక్యా సాయితో కలిసి అశోక్ ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం అశోక్ ఆఫీసు నుంచి రాగానే ముగ్గురు కలిసి దాడికి దిగారు.

పూర్ణిమ భర్త కాళ్లు గట్టిగా పట్టుకోగా, మహేష్, సాయిలు కలిసి అశోక్ మెడకు ఏకంగా మూడు చున్నీలు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. హత్య అనంతరం ఏమీ తెలియనట్లుగా అశోక్ బట్టలు మార్చి, ఆయనకు గుండెపోటు వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా అదే సమాచారాన్ని చేరవేశారు.

పోలీసుల చాకచక్యం..

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అశోక్ మృతదేహంపై ఉన్న గాయాలు అనుమానం కలిగించాయి. మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో లోతుగా విచారణ చేపట్టగా, పూర్ణిమ పొంతన లేని సమాధానాలు చెప్పింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ప్రియుడి కోసమే భర్తను చంపినట్లు ఆమె ఒప్పుకుంది.

దీంతో పోలీసులు పూర్ణిమతో పాటు ప్రియుడు మహేష్, అతడి స్నేహితుడు సాయిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

క్షణికావేశం, అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో ఎలా చిచ్చు పెడుతున్నాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపిన ఈ భార్య ఉదంతం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *