Crime News: వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తారు. కానీ, కొందరు వైద్యులు చేసే చిన్న చిన్న తప్పులు, నిర్లక్ష్యం అమాయక ప్రజల జీవితాలను శాశ్వతంగా చీకట్లోకి నెట్టేస్తున్నాయి. చెవి నొప్పితో ఆస్పత్రి మెట్లెక్కిన ఒక 20 ఏళ్ల యువతి.. డాక్టర్ల ఘోర నిర్లక్ష్యం వల్ల చివరికి తన చేతినే పోగొట్టుకోవాల్సి వచ్చిన విషాదకర సంఘటన బీహార్ రాజధాని పట్నాలో వెలుగుచూసింది.
ఏం జరిగింది?
పట్నాకు చెందిన రేఖ (20) అనే యువతికి కొద్దిరోజుల క్రితం తీవ్రమైన చెవి నొప్పి వచ్చింది. దీంతో ఆమె చికిత్స కోసం స్థానిక ‘మహావీర్ ఆరోగ్య సంస్థాన్’ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు.
అయితే, ఆ ఇంజెక్షన్ వికటించడంతో రేఖ చెయ్యి రంగు మారి, ఆకుపచ్చగా అయిపోయింది. దాంతో పాటు చెయ్యి అంతా ఉబ్బిపోయి, భరించలేని తీవ్రమైన నొప్పితో ఆ యువతి విలవిలలాడింది.
పట్టించుకోని వైద్యులు.. వేరే ఆస్పత్రికి వెళ్తే షాక్!
తన చేయి విపరీతంగా నొప్పుడుతోందని, రంగు మారిపోతోందని బాధితురాలు ప్రాధేయపడినా ఆస్పత్రి వైద్యులు కనీసం పట్టించుకోలేదు. అదంతా మామూలేనని, సర్దుకుంటుందని కొట్టిపారేశారు.
నొప్పి మరింత ఎక్కువకావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే పట్నాలోని ‘మేదాంత’ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన నిపుణులు భయంకరమైన విషయాన్ని చెప్పారు. తప్పుడు ఇంజెక్షన్ వల్ల చెయ్యికి రక్తం ప్రసరించే నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇన్ఫెక్షన్ శరీరం మొత్తానికి వ్యాపించకుండా ఉండాలంటే మోచేతి పైభాగం వరకు చెయ్యి తొలగించక తప్పదని తేల్చి చెప్పారు. వేరే దారిలేక ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె చెయ్యి తీసేయడానికి అంగీకరించింది.
జీవితం నాశనమైంది.. పెళ్లి కూడా రద్దు!
వైద్యుల నిర్లక్ష్యానికి ఒక వైపు చెయ్యి పోయి అంగవైకల్యం రాగా.. మరోవైపు ఆ యువతి జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఘటన జరగడానికి ముందే కుదిరిన ఆమె పెళ్లి సంబంధం.. చెయ్యి తీసేయడంతో రద్దైపోయింది.
“చెవి నొప్పి తగ్గించుకుందామని వెళ్తే నా జీవితాన్ని నాశనం చేశారు. తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి నా చేతిని తీసేసేలా చేశారు. నా పెళ్లి కూడా ఆగిపోయింది.. ఇప్పుడు నేను ఎలా బతకాలంటూ” బాధితురాలు రేఖ కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది.
సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
