Mulugu: ములుగు జిల్లాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. ఇద్దరినీ అతి కిరాతకంగా చంపారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన పెను గోలు కాలనీలో మావోయిస్టులు పోలీసుల ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో ఒకరైన ఉయిక రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఉయిక అర్జున్ అనే గిరిజన వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు.
ఉయిక అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా రమేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.వీరిద్దరు వ్యక్తులు కూడా పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి గత కొద్ది సంవత్సరాలుగా మావోయిస్టు కదలికలను పోలీసులకు చేరవేస్తూ మావోయిస్టులపై దాడులకు కారకులు అయ్యారని అందుకే వారిని చంపినట్టు తెలుస్తుంది… మావోలు వీరిద్దరికి పలు మార్లు హెచ్చరించారు.
అయినా వీరు పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చడం జరిగిందని వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖలో పేర్కొన్నారు. వీరిద్దరి హత్య ఏజెన్సీలో మరోసారి కలకలం సృష్టించింది. ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఏటూరు నాగారంలోకి ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.