Chamala kiran: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్టుతో సీఎం రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎంగా మారారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అవినీతి చేసి ప్రజలకూ తెలిసిపోయిందని, కానీ రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని తన ప్రతిభను చాటారని తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక రచించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి దోచుకోవడం, దాచుకోవడం అలవాటు లేదని స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ రూ. 7,000 కోట్ల ప్రాజెక్ట్‌గానే ఉండాల్సి ఉండగా, రూ. 12,000 కోట్ల అవినీతి జరిగిందని మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ మాటలు చూస్తుంటే ఆయన భయంతో ఉన్నట్లు అనిపిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టదని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీశ్ రావు, కవితలు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కేటీఆర్ ఒకే కేసులో ఒక్కో రోజు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తప్పు చేసినట్టు తేలితే ఖచ్చితంగా జైలుకు వెళ్తారని, కానీ ఆయన నిర్దోషి కావాలని కోరుకుంటున్నామని అన్నారు. అయితే, ఆయన తప్పు చేసినట్లు నిర్ధారణ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.