Mana Cinema First Reel: ‘సత్యశోధనను మించిన తపస్సు లేదు’ అన్నారు పెద్దలు. ఇది కళారంగానికీ వర్తిస్తుందని పలువురు నిరూపించారు. ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ రెంటాల జయదేవ నిస్సందేహంగా ఆ కోవకు చెందినవారు. జయదేవ పరిశోధనతోనే తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ అసలైన విడుదల తేదీ వెలుగు చూసింది. అప్పటికి దాదాపు 70 ఏళ్ళ నుంచీ తెలుగు సినిమా జర్నలిజమ్ వెలుగులు పంచినా, తెలుగు సినిమా చరిత్రకారులు అంతగా లేరనే వాస్తవం లోకానికి తెలిసింది జయదేవ ద్వారానే! దాంతో ఒక్కసారిగా తెలుగుసినీ ప్రముఖులు, సినిమా అభిమానులు అందరూ జయదేవ పరిశోధనవైపు దృష్టి సారించారు. ఇదిగో మన తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6వ తేదీన విడుదలయిందంటూ సాక్ష్యాలతో సహా నిరూపించారు. అప్పటిదాకా 1931 సెప్టెంబర్ 15వ తేదీన మన తొలి తెలుగు టాకీ రిలీజయిందని గొప్పగా చెప్పుకొనేవారికి సైతం జయదేవ చూపిన సాక్ష్యాలు నివ్వెర పరిచాయి. అంతలా పరిశోధన చేయడంలోనే ఆనందం పొందే జయదేవ ఇప్పుడు మరోమారు మన భారతీయ సినిమా మూకీల నుండి టాకీల దాకా సాగిన వైనాన్ని సచిత్ర సాక్ష్యంగా మనముందు ఉంచారు. అదే ‘మన సినిమా ఫస్ట్ రీల్’. టైటిలే సినీఫ్యాన్స్ ను ఇట్టే పట్టేసేలా పెట్టేశారు జయదేవ.
ఉపోద్ఘాతంలో జయదేవ గత పరిశోధన గురించి అంతలా చెప్పడానికి కారణం ఈ ‘మన సినిమా ఫస్ట్ రీల్’లో అంతకుమించిన పరిశోధన ఉందని తెలిపేందుకే! ఓ వైపు జర్నలిస్టుగా సాగుతూనే మరోవైపు మన భారతీయ సినిమా పుట్టు పూర్వోత్తరాలు సేకరించడం, వాటికి తగ్గ ఛాయాచిత్రాలను ప్రోది చేయడం చిన్న విషయమేమీ కాదు. నిజంగా అది ఓ తపస్సే అనాలి. గతంలో పలువురు సినిమా చరిత్రకారులు కూడా ఆ కృషి చేసి ఉన్నారు. కాదనలేం. కానీ, జయదేవ చేసినది మాత్రం నిస్సందేహంగా కృషి కాదు తపస్సు! ఈ నాటికీ భారతీయ సినిమా కన్ను తెరచిన వైనాన్ని, ఆ పై బుడి బుడి అడుగులతోనే చిందేసిన బాణీని ఎవరూ ఇంతబాగా కళ్ళకు కట్టినట్టు వివరించి ఉండరు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా, జయదేవ పరిశోధనలోని గొప్పతనాన్ని ‘ఫస్ట్ రీల్’ పుస్తకమే చాటుతుంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: రాజకీయాల కోసం చిత్త పరిశ్రమకు రంగు పూయకూడదు
Mana Cinema First Reel: ఇదేదో మన భారతీయ సినిమా ఎలా రూపుదిద్దుకుంది, ఆ తరువాత ఎలా మాట నేర్చింది అన్న అంశాల సరం పేర్చడం కాదు. ఆ యా చిత్రాలలో పనిచేసిన వారు తరువాతి రోజుల్లో సాగిన తీరునూ రచయిత కళ్ళకు కట్టినట్టు వివరించారు. తొలి సినిమా రోజుల్లో స్టార్స్ గా వెలిగినవారు తరువాతి రోజుల్లో ఎలా పయనించారు, చిత్రసీమకు వారు చేసిన సేవలనూ రచయిత చక్కగా పొందు పరిచారు. మన భారతదేశంలో తొలి టాకీ చిత్రంగా నిలచిన ‘ఆలమ్-ఆరా’ విడుదలైన మార్చి నెల ఎలా చరిత్రలో నిలచిపోయిందో ఈ తరం వారు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలు ‘ఫస్ట్ రీల్’లో పొందు పరచిన విధానమూ ఓ సినిమా కథ చదివినట్టుగానే ఉంటుంది. ఓ వైపు భారతీయ సినిమా సొంతగా మాట నేర్చి మత్తు చల్లిన వైనం ఆనందం కలిగిస్తున్న సమయంలోనే దేశ స్వాతంత్ర్యం కోసం ‘విప్లవం వర్ధిల్లాలి’ అంటూ ఉరికొయ్యను ముద్దు పెట్టుకున్న ముగ్గురు భరతమాత ముద్దుబిడ్డల బలిదానం ఆవేదన కలిగిస్తుంది. జయదేవ ఆ వ్యాసం రాసిన తీరు మన కళ్ళముందు ఓ సినిమా సాగినట్టుగానే అనిపించక మానదు. ఇలాంటి అనుభూతి కలిగించే అంశాలు మరెన్నో ‘ఫస్ట్ రీల్’లో చోటు చేసుకున్నాయి.
చేతిలో ఉన్న సెల్ ఫోన్ లోనే లోకంలోని సకలం తెలుసుకుంటున్న నవతరం సైతం పుస్తకపఠనంపై మక్కువ పెంచుకుంటోందని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ‘పుస్తక ప్రదర్శన’తో రుజువయింది. గతంతో పోల్చుకుంటే సినిమా అంటే ఆసక్తి చూపించేవారి సంఖ్య సైతం పెరిగింది. నవతరం కేవలం సినిమాలు చూసి ఆనందించడమే కాదు, అందులోని సాంకేతిక పరిజ్ఞానాన్నీ అధ్యయనం చేస్తోంది. ఆ తీరున ఆసక్తిగల వారందరికీ మన భారతీయ సినిమా చరిత్రను అధ్యయనం చేయడం ఎంతో అవసరం. అలాంటి వారిని కచ్చితంగా కట్టిపడేసేలా ‘ఫస్ట్ రీల్’ రూపొందింది. జయదేవ కృషికి తగ్గట్టుగానే ప్రచురణ సంస్థ ‘ఎమెస్కో’ పుస్తకాన్ని తీర్చిదిద్దిన తీరునూ అభినందించవలసిందే. ఈ పుస్తకం వెల రూ.750. సినిమా ప్రియులకు ఈ ధర ఏ మాత్రం ఎక్కువ కాదు. టాప్ స్టార్స్ నటించిన భారీ చిత్రాలను ఫస్ట్ డే చూడాలనుకున్న వారు పెట్టే టిక్కెట్ రేటు కంటే తక్కువే!