Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవన్ కల్యాణ్ భారతీయ చిత్రపరిశ్రమ, టికెట్ ధరల పెంపు, చిత్రపరిశ్రమపై రాజకీయ ప్రభావం వంటి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టికెట్ ధరల అంశంతో పాటు, ఇండస్ట్రీపై ఉన్న అపవాదులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అని వేర్వేరు పేర్లతో పిలవడాన్ని విమర్శించిన పవన్ కల్యాణ్, దేశంలో ఒకటే చిత్రపరిశ్రమ ఉందని, అది భారతీయ చిత్రపరిశ్రమ అని స్పష్టం చేశారు. “ఈ వర్గీకరణ అవసరం లేదు. భారతీయ చిత్రపరిశ్రమను ఒకటిగా చూడాలి,” అని అన్నారు.
టికెట్ ధరల పెంపుపై సమాజంలో ఉన్న అపవాదులపై పవన్ స్పందిస్తూ, టికెట్ ధరలు డిమాండ్, సప్లయ్ ఆధారంగానే పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వం ఊరికే ధరలు పెంచడం లేదని, ప్రతి టికెట్ నుంచి 18% జీఎస్టీ ప్రభుత్వానికి వెళ్తుందని ఆయన గుర్తు చేశారు.
భీమ్లా నాయక్ ఉదాహరణ
గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, “భీమ్లా నాయక్ చిత్రానికి టికెట్ ధర పెంపునకు అవకాశం ఇవ్వలేదు. రాజకీయాల కోసం చిత్రపరిశ్రమకు రంగు రాయడం సరికాదు,” అని అన్నారు.
“సినిమా అనేది ప్రజల వినోదానికి సంబంధించినది. టికెట్ ధరల పెంపుపై సమాజంలో ఉన్న అపవాదులను తొలగించాలి. టికెట్ ధరల పెంపు డిమాండ్, సప్లయ్‌కు అనుగుణంగా మాత్రమే జరుగుతుంది,” అని అన్నారు.