Viral Video: సాధారణంగా రైలులో రిజర్వేషన్ లేని ప్రయాణం అంటేనే నరకం కనిపిస్తుంది. కనీసం 100 కిలోమీటర్లు వెళ్లాలన్నా చాలా కష్టం అవుతుంది. ఒక్కోసారి గేటు దగ్గర నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తే ఇక ప్రాణాలు గాలిలో పెట్టుకుని వెళ్తాం. అదే రైలు కింద కూచుని వెళితే ఎలా ఉంటుందో ఊహించండి. అసలు రైలు కిందకు చేరడమంటేనే ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడం.
అలాంటిది రైలు కింద కూచుని.. 290 కిలోమీటర్లు ప్రయాణించడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఒక వ్యక్తి అలాంటి ప్రయాణం చేశాడు. అసలు అంత రిస్క్ తీసుకుని రైలు కింద కూచుని ఎలా ప్రయాణించాడో.. ఎందుకు ఆ పని చేశాడో తేల్చే పనిలో ప్రస్తుతం రైల్వే పోలీసులు పడ్డారు. అసలు ఆ ప్రయాణం కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Viral Video: దానాపూర్ ఎక్స్‌ప్రెస్ కోచ్ కింద ఓ వ్యక్తి చిక్కుకుపోయిన వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకుంది. అతను ఇటార్సీ నుండి జబల్‌పూర్ (290 కి.మీ) వరకు రైలు బండి కింద చక్రాల మధ్య దాక్కుని ప్రయాణించినట్లు దర్యాప్తులో తేలింది.
జబల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రోలింగ్ పరీక్షలో, రైలు సిబ్బంది కోచ్ కింద తనిఖీ చేయగా, ఒక వ్యక్తి దాక్కున్నట్లు గుర్తించారు. దీంతో షాక్‌కు గురైన ఉద్యోగులు వెంటనే ఆర్పీఎఫ్‌కు ఫోన్ చేశారు. రైలు కింద నుంచి బయటకు వస్తున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.