America: అమెరికాలో లాస్ ఏంజిల్స్‌ను కార్చిచ్చు కుదిపేస్తోంది. వరుసగా రెండవ రాత్రి కూడా అక్కడి అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. ఐదు ప్రాంతాల్లో మంటలు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దావానలంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 27 వేల ఎకరాల అడవి దగ్ధమైపోయింది. ముఖ్యంగా పాలిసేడ్స్, ఈటాన్ ప్రాంతాల్లో మంటలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మంటలను అదుపు చేయడం చాలా కష్టంగా మారింది.
శాన్ ఫెర్నాండో వ్యాలీలో మాత్రం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈటాన్ సిటీలో ఐదుగురు మరణించగా, నగరం నుండి 1.37 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రునియన్ కానియన్ వద్ద దావానలం వ్యాపించడంతో హాలీవుడ్ కొండల వీధుల్లో గందరగోళం నెలకొంది. జనాలు భయంతో పరుగులు తీస్తున్నారు. అనేక మంది హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు కూడా మంటల్లో కాలిపోయాయి.
కార్చిచ్చు కారణంగా కాలిఫోర్నియాలో భారీ విపత్తు సంభవించిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఫెడరల్ నిధులను విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంత ప్రజలకు కేవలం కాచిన నీరు లేదా బాటిల్ నీరే తాగాలని అధికారులు సూచించారు. నీటి కొరత కారణంగా స్విమ్మింగ్ పూల్స్, చెరువుల నుంచి నీటిని తీసుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మంటల వల్ల నటి పారిస్ హిల్టన్‌కు చెందిన ప్రాపర్టీ కూడా దగ్ధమైంది.