Mumbai: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబైలోని కుర్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బెస్ట్ బస్సు అదుపుతప్పి జనలపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి కుర్లా నుంచి అంధేరికి వెళ్తున్న బెస్ట్ బస్సు బుద్ధ కాలనీ వద్ద బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అది పాదచారులు, కొన్ని వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
యాక్సిడెంట్ ను గమనించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను దవాఖానకు తరలించారు.అనంతరం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టామని.. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే బస్సుపై అతడు నియంత్రణ కోల్పోయాడని చెప్పారు. కాగా, బస్సును అతివేగంతో నడిపినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.