mahesh kumar goud: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులే రాష్ట్ర నీటి హక్కులను కాలరాసారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా బనకచర్ల ప్రాజెక్టు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన చాలెంజ్‌ను హరీశ్ రావు స్వీకరించాలని ఆయన సవాల్ విసిరారు. ఆధారాలతో సహా అన్ని లెక్కలతో సభలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్, “తెలంగాణ సీఎంగా ఉండగా కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రులైన చంద్రబాబు, జగన్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కి మేలు చేస్తామని మాట్లాడినదాన్ని మరిచిపోయారా?”** అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ తెలంగాణ వాటా మీద రాజీ పడటం అన్యాయమని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపిన దానికి కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపిన ఒత్తిడే కారణమని అన్నారు.
“బీజేపీకి బీసీ నాయకుడు దొరకలేదా?”
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలకు మరే పార్టీకీ చిత్తశుద్ధి లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. “56 శాతం బీసీలు ఉన్న తెలంగాణలో బీసీని పార్టీ అధ్యక్షుడిగా పెట్టలేని బీజేపీకి మా సీఎంపై మాట్లాడే అర్హత లేదు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీలో బీసీ వర్గానికి చెందిన సమర్థవంతమైన నాయకులు లేరా? అని ప్రశ్నించారు.
“రేపు చేస్తామంటూ వాగ్దానాలు చేయడమే కాదు – ఈ రోజు చేసి చూపించడమే నిజమైన సామాజిక న్యాయం. కాంగ్రెస్ అది చేసి చూపించింది,” అన్నారు. డిప్యూటీ సీఎం స్థానం దళితునికి, పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు.
సామాజిక న్యాయ సమరభేరి – జులై 4న ఎల్బీ స్టేడియంలో
జులై 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న “సామాజిక న్యాయ సమరభేరి” కార్యక్రమానికి గ్రామ కమిటీలు పెద్ద ఎత్తున హాజరవుతారని, ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యంగా ప్రసంగించనున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక సమన్వయానికి కట్టుబడి ఉందని, రాజకీయంగా అవకాశాలు రాని వర్గాల గురించి ఆలోచిస్తున్నదన్నారు.
కవితపై సెటైర్లు
బీసీలపై ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖను హాస్యాస్పదంగా అభివర్ణించారు మహేశ్ కుమార్ గౌడ్. “పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆమె బీసీల గురించి మాట్లాడలేదేంటి? ఇప్పుడు ఎందుకు హటాత్తుగా మాట్లాడుతున్నారు?” అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌కు కనపడని కవిత, ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. “బీఆర్ఎస్ లో మీ వాటాల కోసం పంచాయతీ అయిపోయిందా?”, అని ఎద్దేవా చేశారు.
రైతులకు 9 వేల కోట్లు
“మొత్తం 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయగలిగినది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే” అని గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏమిచ్చిందని, వారు మళ్లీ ఓట్లను కోరడం ప్రజల అవమానమన్నారు. కవిత ఇప్పుడు రాజకీయ శూన్యంలో ఉండి, తన ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.