Mumbai: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి, అందులో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 నియోజకవర్గాల్లో 234 స్థానాల్లో మహాయుతి కూటమి విజయం నమోదు చేసింది.ఈ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజులపాటు మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలు, ర్యాలీలు బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాయి.
ఎన్నికల ఫలితాలు చూస్తే, పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారని స్పష్టమైంది. సోలాపూర్ సిటీ సెంట్రల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవేంద్ర రాజేశ్ కోతే, తన విజయం కోసం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన స్పందిస్తూ, “ఈ విజయం పవన్ కల్యాణ్ గారి కారణంగానే సాధ్యమైందని నేను చెప్పగలను. ఆయన చేసిన ప్రచారం వల్లనే సోలాపూర్ ప్రజలు మహాయుతి అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు” అని అన్నారు.
“రెండు గంటలపాటు పవన్ గారు చేసిన రోడ్ షోతో ఆయన మాటలతో ప్రజలను ప్రభావితం చేశారు” అని తెలిపారు.పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రస్తుతం దేవేంద్ర మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.